కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా తొలగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. హరీష్ రావు..

హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా స్పష్టమైందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం, ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లే GRMB, KRMB సమావేశాలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.
అయితే సమావేశాలు వాయిదా వేయడం మాత్రమే సరిపోదని, తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టుల అంశాలను ఎజెండా నుంచి పూర్తిగా తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలో 42.15 లక్షల మంది రైతులకు ఈ పథకం భరోసా కల్పించిందని తెలిపారు. అయితే ఆగస్టు 13 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా తొలగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న బీమా పథకం కారణంగా 13 లక్షల మంది రైతులు బీమా రక్షణకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనూ గత ప్రభుత్వాల బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే పాత పథకాలను కొనసాగించాలన్న కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉండాలని అన్నారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని హరీష్‌రావు స్పష్టం చేశారు.
– మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు