యెమెన్‌లో హైతీ తిరుగుబాటుదారుల ఆధిపత్యంపై, భారత్‌, చైనా సహా ఆసియా దేశాల యూరప్‌ వాణిజ్యంపై ఆందోళనలు..!

హార్ముజ్‌ జలసంధి ఇప్పటికే మూసుకుపోయిన పరిస్థితుల్లో మరో కీలక సముద్ర మార్గంపై ముప్పు ముదురుతోంది. యెమెన్‌లో హైతీ తిరుగుబాటుదారుల ఆధిపత్యం బాబ్ అల్‌ మండేబ్ జలసంధి చుట్టూ పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో భారత్‌, చైనా సహా ఆసియా దేశాల యూరప్‌ వాణిజ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి..ఈ మార్గం ద్వారా నౌకల రాకపోకలు ప్రమాదకరంగా మారితే, ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మీదుగా వెళ్లడం ప్రత్యామ్నాయంగా మిగులుతుంది. అయితే ఈ మార్గం చాలా పొడవుగా ఉండటంతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

మోఖా పోర్ట్‌పైనా హూతీల ఆధిపత్యం
యెమెన్‌లో కొనసాగుతున్న ఘర్షణల్లో హైతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వ దళాలపై పైచేయి సాధిస్తూ, పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఎర్ర సముద్ర నౌకాశ్రయ నగరం మోఖాను కూడా హైతీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బాబ్ అల్‌ మండేబ్ చుట్టుపక్కల ఉన్న పలు దీవులపై కూడా వారి నియంత్రణ పెరిగినట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ సముద్ర మార్గాన్ని ఉపయోగించే భారత్‌, చైనా సహా ఆసియా దేశాల వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ దారే మార్గమా?
బాబ్ అల్‌ మండేబ్‌ మీదుగా యూరప్‌-ఆసియా మధ్య నౌకాయానం కష్టతరమైతే, నౌకలు ఆఫ్రికా దక్షిణ అంచున ఉన్న కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంటే మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, అట్లాంటిక్‌ మహాసముద్రం నుంచి మళ్లీ హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలి. దీంతో నౌకల ప్రయాణ దూరం భారీగా పెరుగుతుంది. ఫలితంగా సరుకు రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు షిప్పింగ్‌ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.

భారత్‌-ఈయూ వాణిజ్యంపై ప్రభావం?
కౌన్సిల్‌ ఆఫ్‌ ది యూరోపియన్‌ యూనియన్‌ గణాంకాల ప్రకారం, 2025లో భారత్‌-యూరోపియన్‌ యూనియన్‌ మధ్య మొత్తం వాణిజ్యం 136.5 బిలియన్‌ అమెరికా డాలర్లకు పైగా నమోదైంది. ఇందులో ఈయూ నుంచి భారత్‌కు దిగుమతులు, భారత్‌ నుంచి ఈయూకు ఎగుమతులు రెండూ ఉన్నాయి. భారత్‌ నుంచి ఈయూకు సుమారు 75.8 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు, భారత్‌ ఈయూ నుంచి సుమారు 60.7 బిలియన్‌ డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే, ఇలాంటి భారీ వాణిజ్య ప్రవాహాలపై రవాణా సమయం, ఖర్చుల పరంగా ప్రభావం పడే అవకాశం ఉంది.

బాబ్ అల్‌ మండేబ్‌ ఎందుకంత కీలకం?
అనాడోలు ఏజెన్సీ నివేదిక ప్రకారం, హైతీల డ్రోన్లు, దాడుల భయంతో బాబ్ అల్‌ మండేబ్‌ గుండా నౌకల రాకపోకలు సుమారు 88 శాతం తగ్గాయి. హైతీలు తాము సౌదీ అరేబియా నౌకలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ, ఇతర దేశాల నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణించేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తున్నది. సాధారణ పరిస్థితుల్లో ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ సముద్ర మార్గం గుండా సాగుతుంది. అంతేకాకుండా తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటీకి హైతీ ఆధీన ప్రాంతాలు కేవలం 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. జిబౌటీలో అమెరికా సహా పలు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ పరిణామాలు బాబ్ అల్‌ మండేబ్‌ ప్రాధాన్యాన్ని మరింత పెంచుతున్నాయి..