రాష్ట్రంలోనే పేరుగాంచిన హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరకు వేళైంది. నేడు రేపు పెద్ద, చిన్న ముత్యాలమ్మలతో పాటు గురువారం కనకదుర్గమ్మ జాతరను నిర్వహించనున్నారు. ఇక్కడ పోచమ్మతల్లి ముత్యాలమ్మగా ప్రసిద్ధి. పెద్దముత్యాలమ్మ, చిన్నముత్యాలమ్మలో పాటు కనకదుర్గమ్మ జాతర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభ బండ్లతో రైతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జాతర సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు..
పోంచర్ల గ్రామమే నేటి హుజూర్నగర్. పట్టణంలోని ఊరచెరువులో ఎన్నో దశాబ్దాల క్రితం పోచమ్మ తల్లి కొలువుతీరింది. పోచమ్మతల్లి పేరు మీదనే పోంచర్ల గ్రామంగా రికార్డుల్లో నమోదైంది. కాగా నైజాం నవాబులకాలంలో పోంచర్ల కాస్తా హుజూర్నగర్గా మార్పు చెందింది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు హుజూర్ అనే నవాబు ఈ ప్రాంతాన్ని పరిపాలించగా హుజూర్నగర్గా పేరు మారింది.
రాష్ట్రంలో పెద్ద జాతర్లలో ఒకటిగా హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరకు పేరుంది. జాతర సందర్భంగా చల్లగుడి ఎత్తే కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి. ఈనెల ఐదో తేదీన పెద్దముత్యాలమ్మ (పోచమ్మతల్లి), ఆరో తేదీన చిన్న ముత్యాలమ్మ, తొమ్మిదో తేదీన కనకదుర్గమ్మకు ప్రభలు కట్టి ఘనంగా జాతర నిర్వహించనున్నారు. ప్రతి రోజూ జాతరకు లక్షమంది భక్తులు తరలిరానున్నారు. శతాబ్దాల కాలంగా ప్రతి ఏడాది శ్రావణమాసంలో పోచమ్మ తల్లికి, ముత్యాలమ్మ, మద్దిరావమ్మ, అంకమ్మ, మహాలక్ష్మమ్మ దేవతా మూర్తులు పూజలందుకోవడం ఆనవాయితిగా వస్తోంది. ఈ దేవాలయాలకు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది..
హిస్టరీ ఇలా ఉన్నది..
పోచమ్మతల్లి విగ్రహాన్ని కొంతమంది హుజూర్నగర్ (పోంచర్ల) గ్రామం మీదుగా ఎడ్లబండిపై తీసుకెళుతుండగా బండి శిరస్సు విరిగిందట. భక్తులు బండిని సరిచేస్తుండగా, తాను ఇక్కడే పోంచర్ల గ్రామంలో కొలువుతీరుతానని, భక్తుల కోర్కెలు తీరుస్తానని పోచమ్మ తల్లి పలికిందట. దీంతో భక్తులు ఆ విగ్రహాన్ని వదిలి వెళ్లారట. పోచమ్మతల్లిగా, ముత్యాలమ్మ తల్లిగా కొలువుతీరానని గ్రామ పెద్దల కలలోకి రావడంతో పట్టణంలో గుడి నిర్మించినట్లు పెద్దలు చెబుతున్నారు.
అప్పటి నుంచి ప్రతి ఏడాది శ్రావణమాసంలో ముత్యాలమ్మ తల్లికి రైతులు ప్రభలతో ప్రదర్శన చేసి, బోనాలు సమర్పించి, మేకలు, గొర్రెలు, కోళ్లను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంతకుముందే గ్రామంలో ముత్యాలమ్మతల్లి ఉండగా ఆమెను మరొక చోట ప్రతిష్ఠించి ఆదేవతను చిన్న ముత్యాలమ్మ తల్లిగా, పోచమ్మను పెద్దముత్యాలమ్మగా నామకరణం చేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాగా చిన్నముత్యాలమ్మ దేవాలయంలో ముత్యా లమ్మతో పాటు మద్ది రావమ్మ, అంకమ్మ దేవాలయాలను నిర్మిం చగా పెద్దముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో పోచమ్మతల్లి, మహా లక్ష్మమ్మ, మద్దిరావమ్మ ఆలయాలు నిర్మించి పూజలు చేస్తున్నారు. గుడి ఎదుట పోతురాజు విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
పోచమ్మ దేవాలయ నిర్మాణం అనంతరం కొంతమంది దొంగ లు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి వజ్రవైఢూర్యాలను అపహరించుకుపోతుండగా దేవాలయానికి పక్కనే ఉన్న చెరువుకట్ట ఎక్కే సమయానికి దొంగలు రక్తం కక్కుకుని చనిపోయారని గ్రామ పెద్దలు తెలిపారు. దీంతో వారికి అక్క డ సమాధులు నిర్మించారన్నారు..
పండగ ఎప్పుడు అని ఎదురుచూసే చుట్టుపక్కల ప్రజలు..
ముత్యాలమ్మ జాతర ఎప్పుడు వస్తుందా అంటూ చుట్టుప్రక్కల ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.. ఈ జాతరకి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికంగా వస్తుంటారు… పోచమ్మ తల్లికి బోనం చెల్లించాలని భక్తిశ్రద్ధలతో మొక్కులు ముక్కుకుంటూ ముడుపులు చెల్లించుకుంటారు…. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా తల్లి విరజిల్లుతూ ఉంటుంది..
కిలోమీటర్ల మేర, ప్రభలు,, భారీ బందోబస్తు..!
ఒంగోలు జాతి గిత్తలతో ప్రభల ఊరేగింపు, పోటీ ప్రద ర్శన నిర్వహించడం ఆనవాయితీ. జాతరకు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది…మహిళలు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవార్లకు చీర, సారెలను భక్తిశ్రద్ధలతో సమర్పిస్తున్నారు. రైతులు ట్రాక్టర్లకు ప్రభలు కట్టి మేళతాళాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. జాతరను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కోళ్లు, మేకలు బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. యాదవుల సంప్రదాయ నృత్యాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ప్రతి ఇంటికీ బంధువుల రాకతో హుజూర్నగర్ పట్టణంలో శనివారం సాయంత్రం నుంచే సందడి సంతరించుకన్నది…