భారత్, పాకిస్తాన్ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలి..వేర్వేరు రంగాలకు చెందిన 117 మంది ప్రముఖులు సంయుక్తంగా ఓ లేఖ..!

నిత్యం భారత్ పాక్ సరిహద్దులన్నీ కూడా ఎప్పుడూ హైఅలర్ట్ లోనే ఉంటాయి. డేగ కళ్లతో పహారా కాస్తుంటారు భద్రత బలగాలు. దౌత్యపరంగానే కాకుండా క్రీడల్లోనూ ఇదే తరహా వాతావరణం ఎప్పటి నుంచో ఉంటోంది. ఇప్పటికీ భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేవు.

ఈ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతూ భారత్, పాకిస్తాన్ నుంచి తాజాగా వినతులు వెల్లువెత్తాయి. వేర్వేరు రంగాలకు చెందిన 117 మంది ప్రముఖులు సంయుక్తంగా ఓ లేఖ రాశారు. ప్రధానులు మోదీ, షెహబాజ్ షరీఫ్‌లకు విడివిడిగా ఈ లేఖను పంపించారు. సుదీర్ఘ కాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను వీడి, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.

సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ సంస్థ చైర్మన్ ఓపీ షా చొరవతో ఈ వినూత్న ప్రయత్నం తెర మీదికి వచ్చింది. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో భారత్‌కు చెందిన 61 మంది, పాకిస్తాన్‌కు చెందిన 56 మంది నిపుణులు, ప్రముఖులు ఉన్నారు. వీరిలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్, రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా, భారత నిఘా సంస్థ ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దులాత్ ఉన్నారు.