కాళేశ్వరం ప్రాజెక్టు మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు..ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి..

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా, రాష్ట్రంలో కరువును పారద్రోలేలా కేసీఆర్‌ నిర్మించారని చెప్పారు. ఆరు వందల మీటర్ల లోతు నుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టని చెప్పారు. బీఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందన్నారు. కానీ ప్రాజెక్టు గొప్పదనాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతున్నదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు…ఇంత పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు రావడం సహజమని చెప్పారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్‌ భూతద్దంలో చూపిస్తున్నదని విమర్శించారు. పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు చేయాల్సిందిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ దగ్గర ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 86 పిల్లర్లకు 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని సరిచేయాలన్నారు. సాంకేతిక సమస్యను రాజకీయ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

‘కాళేశ్వరంలో మొత్తం196 స్కీం ఉన్నాయి. మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న తాము ఎన్నడు బద్నాం చేయలేదు. కడెం ప్రాజెక్టు రెండుసార్లు తెగింది. మెడిగడ్డ కేవలం కుంగింది తెగలేదు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండి. రైతు ప్రయోజనాలకు అడ్డు పడొద్దని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే వర్ష కాలం నాటికి సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌లో నీటిని నింపాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే మీకే నష్టం. గతంలో 40 ఏండ్లయినా ఒక్కో దగ్గర ప్రాజెక్టులు పూర్తికాలేదు. కానీ తాము కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేశాం. రైతుబంధు అతీగతీ లేదు. ఇప్పటికి మూడు సార్లు పెండింగ్‌లో పెట్టారు. తాము రైతుబంధు సకాలంలో అందించాం కాబట్టే ఐదు రెట్లు ఎక్కువగా పండాయి.’ అని పోచారం అన్నారు..