ఫైనల్లో భారత్.. ప్రపంచకప్‌కు అడుగు దూరంలో మన కుర్రాళ్లు!.

ఫైనల్లో భారత్.. ప్రపంచకప్‌కు అడుగు దూరంలో మన కుర్రాళ్లు!.

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్ సంచలన విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ నిర్మించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కుర్రాళ్లు ఊపిరి బిగబట్టే ఉత్కంఠ లేకుండా ఛేదించేశారు. ఈ గెలుపుతో భారత్ రికార్డు స్థాయిలో 10వ సారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. అఫ్గాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి చరిత్రలోనే భారత్‌పై అత్యధిక స్కోరు సాధించినా, మన బ్యాటర్ల ముందు అది తలవంచక తప్పలేదు..

అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ ఘనవిజయం సాధించింది! ఆఫ్ఘనిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి,సగర్వంగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో మన బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. ముఖ్యంగా ఆరోన్ జార్జ్ 115 పరుగులతో సెంచరీ సాధించి జట్టు విజయానికి వెన్నెముకగా నిలవగా.. వైభవ్ సూర్యవంశీ 68 పరుగులు, ఆయుష్ మాత్రే 62 పరుగులతో రాణించి కీలక పాత్ర పోషించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌పై ఏ జట్టు కూడా ఇంత భారీ స్కోరు చేయలేదు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలతో కదం తొక్కారు. ఫైసల్ షినోజాదా 93 బంతుల్లో 110 పరుగులు చేయగా, ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క చౌహాన్ చెరో రెండు వికెట్లు తీసినా పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు..

భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ లక్ష్యాన్ని చాలా చిన్నదిగా చేసేశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్, మొత్తం 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి అఫ్గాన్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మొదటి 10 ఓవర్లలోనే భారత్ 91 పరుగులు చేసి అఫ్గానిస్థాన్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆరంభంలో వైభవ్ చూపిన వేగం, భారత్‌కు రన్ రేట్ భయం లేకుండా చేసింది.

వైభవ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే బాధ్యతాయుతంగా ఆడాడు. ఆరోన్ జార్జ్‌తో కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు జోడించాడు. ఆయుష్ 59 బంతుల్లో 62 పరుగులు చేసి వెనుదిరగ్గా, ఆరోన్ జార్జ్ మరోవైపు అఫ్గాన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. క్లాసిక్ షాట్లతో అలరించిన జార్జ్, 104 బంతుల్లో 115 పరుగులు చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో విహాన్ మల్హోత్రా (38 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ 41.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది..

ఈ విజయంతో భారత్ ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6వ తేదీన ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మన భారత జట్టు తలపడనుంది.