రెండో టెస్టులో విజయం దిశగా భారత్..

ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆది నుంచి పట్టుబిగించిన గిల్‌ సేన.. ఆతిథ్య జట్టుకు కొండంత లక్ష్యాన్ని విధించింది..బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా.. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 427/6 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

తద్వారా ఇంగ్లండ్‌ ముందు ఏకంగా 608 పరుగుల టార్గెట్‌ ఉంచింది. 64/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో టీమిండియా శనివారం తమ ఆట మొదలుపెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ (269)తో చెలరేగిన భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్‌ దంచికొట్టాడు. 162 బంతుల్లో 161 పరుగులతో భారీ శతకం సాధించాడు.

మిగతా వారిలో ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (55), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (65) అర్ధ శతకాలతో రాణించగా.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (69 నాటౌట్‌) కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, జో రూట్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు మహ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు.

ఇక మరో భారత పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ మరో ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (25), జో రూట్‌ (6) వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ 15, ఓలీ పోప్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరిదైన ఐదో రోజు భారత్‌ మిగిలిన ఏడు వికెట్లు కూల్చి గెలుపొందాలని పట్టుదలగా ఉండగా.. విజయానికి 536 పరుగుల దూరంలో ఉన్న ఇంగ్లండ్‌ కనీసం డ్రా కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో టెస్టు-2025 (బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6))

వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం, బర్మింగ్‌హామ్‌

టాస్‌: ఇంగ్లండ్‌- మొదట బౌలింగ్‌

భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు- 587 ఆలౌట్‌.

ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు- 407 ఆలౌట్‌..

భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌- 427/6 డిక్లేర్డ్‌- తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని మొత్తం 607
ఇంగ్లండ్‌ లక్ష్యం- 608.

శనివారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 72/3 (16)..

గిల్ మళ్లీ జిగేల్

నాలుగో రోజు భారత బ్యాటర్లు అదరగొట్టారు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముందుగా ఓవర్‌నైట్ 64/1తో రాహుల్, కరుణ్ నాయర్ ఆటను కొనసాగించారు. కరుణ్ త్వరగానే అవుటైనా.. రాహుల్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. కరుణ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన అతను రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం బాదాడు. 162 బంతుల్లో 161 రన్స్ చేశాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన అతను క్రీజులో పాతుకపోయిన కొద్ది దూకుడు పెంచాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. గిల్‌కుతోడు మరో ఎండ్‌లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కూడా సత్తాచాటడంతో భారత్‌కు తిరుగులేకుండా పోయింది. పంత్ తనదైన స్టైల్‌లో అలరించాడు. తొలి ఓవర్‌లోనే వరుసగా 4, 6 దంచిన అతను క్రీజులో ఉన్నంత సేపు ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పంత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా.. గిల్‌కు చక్కటి సహకారం అందించాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆచితూచి ఆడిన అతను 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో చెలరేగిన గిల్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత రెచ్చిపోయాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే నితీశ్(1) మరోసారి విఫలమవ్వగా.. ఆ కాసేపటికే భారత్ 427/6 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది..

రిషభ్ పంత్ బ్యాట్ గాలిలో ఎగిరింది

రిషభ్ పంత్ ఎప్పుడూ షాట్ ఆడేటప్పుడు బ్యాట్‌ను వదిలేసే అలవాటు కలిగి ఉన్నాడు. అతను తరచూ ఈ తప్పు చేస్తాడు. ఇంగ్లాండ్‌పై రెండవ ఇన్నింగ్స్‌లో కూడా అలాంటిదే జరిగింది. జోష్ టంగ్ బంతిపై రిషభ్ గాలిలో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ విజయవంతం కాలేదు. బంతి కాదు కానీ రిషభ్ బ్యాట్ అతని చేతి నుండి జారి గాలిలో ఎగిరింది. దీనిని చూసిన కామెంటేటర్లు, మైదానంలో ఉన్న ప్రేక్షకులు, భారత జట్టు ఆటగాళ్లు గట్టిగా నవ్వుకున్నారు.