చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరో సంచలనం సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న T20 మ్యాచ్‌లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచాడు..
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన వైభవ్, తొలి ఓవర్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో అతడు మ్యాచ్‌ను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. సికందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. మధ్యలో ఒక దశలో కేవలం 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది జింబాబ్వే.
అయితే మధెవెరె (39), ర్యాన్ బర్ల్ (26) కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకోగా, చివర్లో మారుమణి (27 నాటౌట్) విలువైన పరుగులు జోడించి స్కోరును 125కు చేర్చాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, శివమ్ దూబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించే విధంగా అతడు ఆడాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో బౌండరీ లైన్‌ను టార్గెట్ చేస్తూ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతని తొలి అంతర్జాతీయ టీ20 అర్ధశతకం కావడం విశేషం.
అర్ధశతకం పూర్తయిన కొద్దిసేపటికే రిచర్డ్ న్గరవా బౌలింగ్‌లో వైభవ్ అవుటయ్యాడు. బంతిని కవర్ దిశగా కొట్టబోగా టాప్ ఎడ్జ్ అయి, డీప్ థర్డ్‌మన్ వద్ద క్యాచ్ ఇచ్చాడు. అయినప్పటికీ అతని ఈ మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా విజయావకాశాలను మరింత బలపరిచింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానం వైభవ్ సూర్యవంశీకి బాగా కలిసొచ్చే వేదికగా మారుతోంది. ఇదే మైదానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై అతడు అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. .