అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఎలాంటి ఆక్రమణలకూ పాల్పడలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు వాస్తవం కాదు..విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్..
చైనా బలగాలు నిశ్శబ్దంగా సరిహద్దులను ఆక్రమిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది..విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ కాంప్లెక్స్లోని రక్షణ శాఖ కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వాస్తవాధీన రేఖ (LAC) వెంట చైనా కదలికలపై ఆన్లైన్లో తలెత్తిన ఆందోళనలను, భద్రతా పరిస్థితులను వీరిద్దరూ సమీక్షించారు.
అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఎలాంటి ఆక్రమణలకూ పాల్పడలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు వాస్తవం కాదని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. సరిహద్దుల్లో చైనా చర్యలను నిశితంగా పరిశీలించడానికి, వారిని నిరోధించడానికి భారత ఆర్మీ, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) పూర్తి స్థాయిలో సద్ధమై ఉన్నాయని స్పష్టం చేశాయి. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో గ్రేట్ హిమాలయన్ పర్వత శ్రేణుల వెంట మౌలిక వసతులను భారత్ భారీగా బలోపేతం చేసిందని, రోడ్ల నిర్మాణం, నిఘా వ్యవస్థలు మెరుగుపడటంతో సరిహద్దు గస్తీ మరింత వేగవంతమైందని అధికారులు వెల్లడించారు. సరిహద్దుల రేఖ స్పష్టంగా లేకపోవడం వల్ల అక్కడక్కడ ఇరుదేశాల పెట్రోలింగ్ బృందాలు ఎదురెదురుపడినప్పటికీ, ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక నిబంధనల ప్రకారం ఆ సమస్యలను పరిష్కరించుకుంటున్నట్లు తెలిపారు…