భారత్‌కు ₹40 వేల కోట్లు తిరిగి ఇవ్వనున్న అమెరికా; ట్రేడ్ డీల్‌కు ముందే భారీ కానుక..!!!

కొన్ని నెలల క్రితం వరకు భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన 25% పెనాల్టీ టారిఫ్‌ను రద్దు చేయడమే కాకుండా, ఇప్పటివరకు వసూలు చేసిన ఆ మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు..
ఇదే జరిగితే, భారతీయ ఎగుమతిదారులకు ఇది భారీ విజయమవుతుంది. వీరికి అమెరికా నుండి సుమారు ₹40,000 కోట్లు రీఫండ్ రూపంలో అందనున్నాయి.

ఎందుకు ఈ పెనాల్టీ విధించారు?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం, గత ఏడాది ఆగస్టు 27న భారత్‌పై 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించింది. అయితే, ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం (Trade Deal) ప్రకారం, ఈ పెనాల్టీని తొలగించడమే కాకుండా, వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది.

రీఫండ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు వస్తుంది?

ట్రంప్ పరిపాలన విభాగం ఆగస్టు 27, 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు పెనాల్టీ రూపంలో వసూలు చేసిన టారిఫ్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ కాలంలో భారత ఎగుమతిదారులు చెల్లించిన అదనపు టారిఫ్ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ఈ మొత్తం సుమారు ₹40 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది.

డబ్బు ఎవరికి, ఎలా అందుతుంది?

అమెరికా ‘కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ యాక్ట్’ కింద ఈ రీఫండ్‌ను ప్రకటిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే:

అమెరికా దిగుమతిదారులకు మొదట: ఈ టారిఫ్ మొత్తాన్ని మొదట అమెరికాలోని దిగుమతిదారులు (Importers) చెల్లించారు. వారు ఆ భారాన్ని భారత ఎగుమతిదారులపై (Exporters) వేశారు.
భారత వ్యాపారులకు వాటా: ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఆ డబ్బును అక్కడి దిగుమతిదారులకు తిరిగి ఇస్తుంది. ఆ తర్వాత, భారత ఎగుమతిదారులు తమకు రావాల్సిన వాటా గురించి అక్కడి వ్యాపారులతో చర్చలు జరిపి రీఫండ్ పొందాల్సి ఉంటుంది.
గణాంకాల వివరాలు

2024లో అమెరికా దిగుమతి సుంకాల రూపంలో 79 బిలియన్ డాలర్లు వసూలు చేయగా, పెనాల్టీ టారిఫ్ విధించిన తర్వాత 2025లో ఆ మొత్తం 194 బిలియన్ డాలర్లకు పెరిగింది. అమెరికా మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా 3.5 శాతం. ఈ లెక్కన భారత్ నుండి సుమారు ₹40 వేల కోట్లు టారిఫ్ రూపంలో వసూలు చేసినట్లు అంచనా, ఇప్పుడు అదే మొత్తాన్ని వైట్ హౌస్ వెనక్కి ఇవ్వనుంది..