భారత్‌-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో…ఉగ్రవాదుల వేటకు భారత్‌-నేపాల్‌ సంయుక్త ఆపరేషన్‌

ఉగ్రవాద అనుమానితుల కోసం దట్టమైన అడవుల్లో నేపాల్ సాయుధ పోలీసు దళం, సశస్త్ర సీమా బల్ అన్వేషణ

భారతదేశం-నేపాల్ సరిహద్దులోని నో-మ్యాన్స్ ల్యాండ్ ఏరియాలో సైనిక విన్యాసాలు జరిగాయి.

పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాద అనుమానితులను గుర్తించడానికి రెండు దళాలు క్రమం తప్పకుండా నిఘా సమాచారాన్ని పంచుకుంటాయి..

భారత్‌-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్తానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందిన దరిమిలా ఇరు దేశాలు సంయుక్తంగా పెట్రోలింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి..పాకిస్తానీ ఉగ్రవాదులను(Pakistani terrorists) గుర్తించేందుకు నేపాలీ దళాలతో కలిసి ఎస్‌ఎస్‌బీ అధికారులు భారత-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించారని ఇండియా టుడే పేర్కొంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం భారతదేశ సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ),నేపాల్‌కు చెందిన సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్‌)లు సరిహద్దుల్లోని దట్టమైన అడవులలో సంయుక్తంగా గాలింపు చేపట్టాయని సమాచారం. భారత్‌-నేపాల్ 1,700 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఎస్‌ఎస్‌బీ కమాండెంట్ గంగా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము జరిపిన ఉమ్మడి పెట్రోలింగ్‌(Joint patrolling)లో నేపాల్ సైనికులు ఉగ్రవాదంపై పోరాటానికి తమతో సహకరించారని అన్నారు. నేపాలీ సైనిక దళాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రతి నెలా రెండు దేశాల సరిహద్దు దళాల సమన్వయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. నేపాల్‌ సైనికాధికారులు తమ నిఘా సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నారని, తాము కూడా వారితో సమాచారాన్ని షేర్‌ చేసుకున్నామన్నారు..