తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీళ్ల పంచాయితీ హాట్ టాపిక్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నీళ్ల పంచాయితీ హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణా జలాల పంపిణీ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి హక్కులకు నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యంగా కేసీఆర్, హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు.రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో జల్‌జీవన్ మిషన్ కింద ప్రాజెక్టు చేపట్టేందుకు జీవో ఇచ్చారని చెప్పారు. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ అంశంపై ఒక్కసారి కూడా స్పందించలేదని విమర్శించారు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విషయం తమ దృష్టికి రావడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారని వివరించారు. అన్ని ఆధారాలతో బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. “కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే, ఆయనకు, అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న సమయంలోనే 2022లో పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో వచ్చింది. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తూ, 2024లోపు పూర్తి చేయాలని జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం దీనికి సాయం చేస్తున్నా, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) దగ్గర గానీ, జల జీవన్ మిషన్‌లో గానీ కేసీఆర్ ఏనాడూ ఒక్క అభ్యంతరం కూడా తెలపలేదు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.2005 సెప్టెంబర్‌లో జీవో 170 వచ్చే సమయానికి తాను మంత్రిగా లేనని హరీశ్ రావు అంటున్నారు. కానీ, 2005 మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే పోతిరెడ్డిపాడుకు నిధులు కేటాయించారు. క్యాబినెట్ ఆమోదం తర్వాతే బడ్జెట్లో నిధులు పెడతారు. ఆ బడ్జెట్ ఆమోదం పొందేనాటికి హరీశ్‌రావుతో పాటు ఐదుగురు అప్పటి తెరాస నేతలు మంత్రులుగా ఉన్నారు. వార్డు మెంబర్‌గా కూడా లేని హరీశ్‌రావును నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రిని చేశారు. ఆ కృతజ్ఞతతో, గురుదక్షిణగా పోతిరెడ్డిపాడుకు, హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీల నీటి తరలింపునకు హరీశ్‌రావు అనుమతులు ఇచ్చారు. ఆయనకు అసలైన గురువు కేసీఆర్ కాదు, వైఎస్ఆర్,” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2005లో కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
కృష్ణా జలాల వాటాపై 2015, 2020 సంవత్సరాల్లో జరిగిన ఒప్పందాలపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో పరివాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 575 నుంచి 578 టీఎంసీల నీళ్లు రావాలి. పాత ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది వాటాలపై మాట్లాడుకునే వెసులుబాటు ఉండేది. కానీ 2015 జూన్ 26న కేంద్ర జల్ శక్తి ఆధ్వర్యంలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ సంతకాలు చేశారు. ఆ తర్వాత 2020 జనవరి 29న ఏపీకి శాశ్వతంగా 512 టీఎంసీలు వెళ్లేలా మరోసారి సంతకం చేసి తెలంగాణ నీటి హక్కులపై మరణ శాసనం రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల దోపిడీని ఆపే శక్తి లేకపోతే…. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఎందుకు అడ్డుకోలేకపోయారు….?” అని సీఎం ప్రశ్నించారు.