మాల్దీవులు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు భారత్ సహకారం..4,850 కోట్లు రుణం- స్వేచ్ఛా వాణిజ్యంపై కూడా చర్చలు: ప్రధాని మోదీ…
మాల్దీవులు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు భారత్ ఎల్లప్పుడు సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశ పర్యటనకు వెళ్లిన మోదీ భారత్ మహాసాగర్ విజన్లో మాల్దీవులుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ద్వీపదేశానికి రూ.4,850 కోట్లు రుణంగా ఇస్తామని వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చునేందుకు కూడా చర్చలను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చామని ప్రధాని తెలిపారు.
మోదీ ఘనస్వాగతం..
బ్రిటన్ పర్యటన ముగించుకొని మాల్దీవులుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మాలె విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్-ముయిజ్జు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి, మోదీకి స్వాగతం పలికారు. రిపబ్లిక్ స్వ్కేర్ వద్ద ఆ దేశ సైనికుల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. ఈ క్రమంలో మాల్దీవుల రక్షణ కార్యాలయంపై మోదీ ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం మాల్దీవులు అధ్యక్షుడి కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ ఆ దేశాధినేతతో విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు..
తొలుత ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపి వాటిని మరింత బలపర్చుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్యం, డిజిటల్ ఎకానమీ, మౌలిక వసతులు, మత్స్యరంగం, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పరస్పరం సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరత, ప్రగతి కోసం కృషి చేయాలని భారత్, మాల్దీవులు ఒక నిర్ణయానికి వచ్చాయని విదేశాంగశాఖ తెలిపింది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. స్చేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పారు. భారత్ అనుసరించే ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం ఉంది అని అన్నారు..