అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ, ఎఫ్-35 యుద్ధ విమానాల డీల్‌కు బ్రేకులు వేసినా భారత్…!

భారత్‌కు తన రక్షణ రంగ ఎగుమతులను మరింత విస్తరించాలని భావిస్తున్న అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఎఫ్-35 యుద్ధ విమానాల డీల్‌కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. ఎఫ్-35 విమానాల కొనుగోలుపై భారత్‌ ఆసక్తి చూపడం లేదని బ్లూమ్‌బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం సుంకాల వివాదం నెలకొన్న నేపథ్యంలో రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో భారత్‌ ముందుకెళ్లాలనుకోవడం లేదని వెల్లడించింది. ఇదే సమయంలో భారత్‌ ప్రాధాన్యతలకు అనుగుణంగా రష్యా కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

టారిఫ్ వార్ ఎఫెక్ట్
భారత్‌పై 25శాతం టారిఫ్‌లతోపాటు, పెనాల్టీ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల వివాదానికి తెరలేపారు. ఈ చర్యలతో అసంతృప్తితో ఉన్న భారత్‌ రక్షణ రంగ ఒప్పందాల ఆమోదం విషయంలో ముందుకువెళ్లాలనుకోవడం లేదని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ట్రంప్‌ సుంకాలకు భారత్ తక్షణమే దీటుగా బదులిచ్చే యోచన చేయడం లేదని, అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగించాలని కోరుకుంటోందని ఆ కథనంలో వెల్లడించింది. అయితే కొత్త రక్షణ ఒప్పందాలను భారత్‌ ఆమోదించే అవకాశం లేదని తెలుస్తోంది. F-35 యుద్ధ విమానాల కొనుగోలుపై ఆసక్తి లేదని అమెరికా అధికారులకు భారత్‌ చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ పరిణామంతో భారత్‌కు తన రక్షణ రంగ ఎగుమతులను మరింత విస్తరించాలని భావిస్తోన్న అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

స్వదేశీ యుద్ధ విమానాల తయారీపై భారత్ దృష్టి!
స్వదేశీ పరిజ్ఞానం, దేశీయ తయారీపై దృష్టి పెట్టడమే అమెరికా డీల్‌పై భారత్‌ ఆసక్తి చూపకపోవడానికి మరో కారణంగా తెలుస్తోంది. దేశీయంగా రక్షణ పరికరాలను సంయుక్తంగా తయారు చేయడం, రూపొందించడంపై దృష్టి సారించే ఒప్పందాలపైనే ఇండియా ఎక్కువ ఆసక్తి చూపుతుందని రక్షణశాఖ అధికారులు వెల్లడించినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం, స్థానికంగా తయారీ, స్వదేశీ సామర్థ్య అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉందని వారు చెప్పినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, శత్రుభీకరమైన ఎఫ్-35 యుద్ధవిమానాలను విక్రయించేందుకు యూఎస్‌ అంగీకరించింది .మోదీతో భేటీ అనంతరం ట్రంప్‌ డీల్‌పై ప్రకటన చేశారు..