ముంబై లోని నావల్ డాక్ యార్డులో జనవరి 15వ తేదీన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అనే రెండు యుద్ద నౌకలు, ఐఎన్ఎస్ వాఘ్ షీర్ అనే జలాంతర్గామిని ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అంకితం చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్బర్ కింద చేపట్టిన కార్యక్రమాల వల్ల రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక ప్రగతి తదితర అంశాలలో దేశం ముందుకు సాగుతోందన్నారు. సాగర శక్తిగా భారత దేశం ఆవిర్బవించిందని వ్యాఖ్యానించారు. సముద్ర జలాలలో డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదుల రవాణాను అరికట్టేందుకు మన దేశం అంతర్జాతీయ స్థాయిలో చురుకైనా భాగస్వామిగా మారుతోందన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలో రూ.1.5 ట్రిలియన్ల విలువైన 60 పెద్ద నేవీ షిప్పులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఒక్కో నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 14 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత సాయుధ దళాల సామర్థ్యం పెరుగుతోందన్నారు. అలాగే ఆర్థిక ప్రగతి బాటలు ఏర్పడుతున్నాయన్నారు. నౌకా నిర్మాణంలో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రెండింతల లాభం ఉంటుందన్నారు.
దేశంలో 60 నౌకల నిర్మాణం జరుగుతుండడం అందరికీ గర్వకారణమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ ఓడలకు ఉపయోగించే విడిభాగాలను దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచి తీసుకుంటున్నారన్నారు. దీని వల్ల ఆయా పరిశ్రమలకు ఆదాయం లభిస్తుందని, అలాగే ఆ రంగంలో దాదాపు 12 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం కలుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైన్యాన్ని ఆధునీకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 21 శతాబ్దంలో ఇది అత్యంత అవసరమని నొక్కి చెప్పారు. భూమి, నీరు, గాలితో పాటు అంతరిక్షంలో కూడా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
కర్ణాటకలో అతి పెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం, సాయుధ దళాల రవాణా విమానాల కర్మాగారాన్ని స్థాపించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడులోని డిఫెన్స్ కారిడార్లు దేశీయ రక్షణ ఉత్పత్తిని పెంచడంలో కీలకంగా ఉన్నాయన్నారు. వార్షిక దేశీయ రక్షణ ఉత్పత్తి రూ.1.25 ట్రిలియన్లు దాటిందని, వంద కంటే ఎక్కువ దేశాలకు సైనిక పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు.