తల్లిదండ్రుల తర్వాత దైవంతో సమానంగా పూజించే గురువుల పట్ల ప్రస్తుత యువత వైఖరి కలవరపరుస్తోంది. ‘ఆచార్య దేవోభవ’ అని గౌరవించే గొప్ప సంస్కృతి మనది. కానీ, నేటి కాలంలో కొందరు విద్యార్థులు టీచర్ల పట్ల చూపిస్తున్న విపరీత ప్రవర్తన చూస్తుంటే భయాందోళనకు గురవ్వాల్సి పరిస్థి ఏర్పడింది.
https://x.com/i/status/2019399908609126559
విద్యాబుద్ధులు నేర్పే గురువులపైనే దాడులకు తెగబడటం, వారి పట్ల పైశాచికంగా ప్రవర్తించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘోర సంఘటన పవిత్రమైన గురుశిష్యుల బంధానికే మాయని మచ్చగా మారింది. చదువు చెప్పే టీచర్‌పై ఓ విద్యార్థి చేసిన అమానుష దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాధాకృష్ణ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన టీచర్‌పై కక్ష పెంచుకున్నాడు. గురువారం రోజు ఆమె క్లాసు నుండి బయటకు వెళ్తుండగా అడ్డగించిన ఆ విద్యార్థి, ఆమెతో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. టీచరని కూడా చూడకుండా ఆమె పెదాలను కోసి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. అంతటితో ఆగకుండా తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా, అది పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
బాధితురాలు భోగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సదరు విద్యార్థి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె పలుమార్లు మందలించినట్లు సమాచారం. దీన్ని మనసులో పెట్టుకున్న విద్యార్థి, ఆమెపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాడి జరిగిన వెంటనే ఆమె కేకలు వేయడంతో తోటి సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న టీచర్‌ను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సైఫాయ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన విద్యార్థి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. గురువుపై ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన విద్యార్థిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల మానసిక స్థితి, వారిలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి ఈ ఘటన అద్దం పడుతోందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.