ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందా వెలుగులోకి వచ్చింది.
కాంప్లిమెంటరీ టికెట్లను పక్కదారి పట్టించి భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
స్టేడియం పరిసరాల్లో బహిరంగంగానే బ్లాక్ టికెట్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని సమాచారం.
దాడులు నిర్వహించిన పోలీసులు బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి పలువురు కాంప్లిమెంటరీ టికెట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు..
ఈ క్రమంలో క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఆశను నిరాశ కలిగిస్తూ భారీ బ్లాక్ టికెట్ల దందా (Black ticket scam) వెలుగులోకి వచ్చింది. మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకునే సామాన్య అభిమానులకు టికెట్లు దొరకడమే గగనంగా మారిన తరుణంలో.. కొందరు కేటుగాళ్లు ఉచితంగా వచ్చే కాంప్లిమెంటరీ (Complementary) టికెట్లను సైతం పక్కదారి పట్టించి బ్లాక్లో విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు.
సెలబ్రిటీలు, అధికారులు, వివిఐపిలకు ఉచితంగా కేటాయించే అత్యంత విలువైన కాంప్లిమెంటరీ టికెట్లు బహిరంగంగా బ్లాక్ మార్కెట్లోకి రావడం కలకలం రేపింది. సాధారణ టికెట్లతో పాటు ఈ ఉచిత పాసులను కూడా అక్రమార్కులు సామాన్య అభిమానులకు భారీ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో రహస్యంగా నిఘా పెట్టిన రాచకొండ టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు.. బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న నలుగురు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న అక్రమ టికెట్లను, నగదును, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు నిందితులను SOT అధికారులకు అప్పగించారు.