ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి..

పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గడచిన 24 గంటల్లో 50కిపైగా యుద్ధ విమానాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరాన్‌ సరిహద్దుకు సమీపంలోని తన వైమానిక, నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 50కిపైగా ఎఫ్‌-16, ఎఫ్‌-22, ఎఫ్‌-35 యుద్ధ విమానాలను మోహరించినట్లు అమెరికా ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ అమెరికన్‌ మీడియా వెల్లడించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు పశ్చిమాసియా దిశగా పయనిస్తున్నట్లు స్వతంత్ర విమాన ట్రాకింగ్‌ డాటా సూచించింది.ఇరాన్‌ అణు కార్యకలాపాలపై అమెరికా, ఇరాన్‌ ప్రతినిధుల మధ్య పరోక్ష చర్చలు సాగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఆందోళనలు కొనసాగుతూ ప్రత్యక్ష పోరు అనివార్యంగా కనిపిస్తున్నప్పటికీ దౌత్యపరమైన ప్రయత్నాలు మాత్రం ఇటీవల కొన్ని వారాలుగా జరుగుతున్నాయి. తన బలాన్ని మరింత ప్రదర్శించేందుకు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ ఆగెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ను పశ్చిమాసియాకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. కరీబియన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ యుద్ధ నౌకకు గతవారం అమెరికా కొత్త బాధ్యతలు అప్పగించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా సంస్థలు వెల్లడించాయి.