ఈ రహస్య పొత్తులు బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆగ్రహం.. !

మున్సిపల్ ఎన్నికల వేడి ఇప్పుడు ఢిల్లీకి పాకింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలోప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో బీజేపీ నేతలు కుమ్మక్కు అయ్యారనే వార్తలు అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు వ్యవహారశైలిపై ప్రధాని మోడీతో సహా కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగి ఛైర్మన్ ఎంపిక సందర్భంగా ఇస్నాపూర్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏకంగా బీఆర్ఎస్‌కు ఓటు వేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అటు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిధిలోని ఎల్లంపేటలో కూడా బీజేపీ, బీఆర్ఎస్‌కు మద్దతు పలికింది. అయితే ఈటల అక్కడ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఓటు వేయకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా, బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో ఈ రహస్య పొత్తులేంటని ఢిల్లీ పెద్దలు మండిపడినట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ నితిన్ నబీన్ వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఫోన్ చేసి పూర్తి వివరాలు కోరారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా రాంచందర్‌రావును కలిసి ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి ఎవరెవరు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారో, ప్రత్యర్థులకు ఎలా సహకరించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా సమాచారం.