ఇరాన్ ఎవరికీ తలవంచబోదని , బాహుబలి సినిమాలోని వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది..!

ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎవరికీ తలవంచబోదని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ)లో పెజెష్కియాన్ మాట్లాడారు.ఈ సందర్బంగా తాజా యుద్ధ పరిస్థితిపై మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల్ని తప్పుబట్టారు.

ఇరాన్‌కు తీవ్రవాదాన్ని ఆపాదించడాన్ని కూడా ఆయన విమర్శించారు. తప్పు చేసిన వారే తమపై అలాంటి ఆరోపణలు చేస్తారన్నారు. టెర్రిస్టులే తమను టెర్రరిస్టు దేశం అని విమర్శిస్తారన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ బాహుబలి సినిమాలోని వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలోని కాలకేయులతో యుద్ధం చేసే వీడియోను ఇరాన్ ఎంబసీ పోస్టు చేసింది. కాలకేయులను ఓడించేందుకు బాహుబలి నిలబడ్డట్లుగానే.. తాము కూడా మాతృదేశం కోసం నిలబడతామని, రక్తాన్ని చిందించేందుకు సిద్ధమని పోస్టులో పేర్కొంది.ఇరాన్ ఎవరిముందు తలవంచబోదని, మోకాళ్లపై కూర్చోదని తమ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఐరాసలో చెప్పడాన్ని కూడా పోస్టులో వివరించింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పాశ్చాత్య దేశపు శతృవులను కాలకేయులతో పోల్చొద్దని కొందరు సూచిస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమా క్లిప్‌ను ఇంటర్నేషనల్ లెవల్‌లో ఎలివేట్ చేయడంపై ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.