ఇరాన్‌లోని అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన ఇరాన్.. అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించింది..తాజాగా సిరియాలోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ గానీ, అమెరికా గానీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇరాన్ స్థానిక మీడియాలో ఈ దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌లోని మూడు అణుస్థావరాలపై అమెరికా దాడులు చేసిన ఒక రోజు వ్యవధిలోనే ఈ దాడులు జరిగినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఇరాన్ దాడులు నిజంగానే జరిగాయా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది….ఇదిలాఉండగా ఇరాన్‌పై అమెరికా దాడులను తాజాగా ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ కూడా తీవ్రంగా ఖండించింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. యుద్ధం ప్రారంభించింది అమెరికానే అయినప్పటికీ.. మేము ముగింపు పలుకుతామంటూ తేల్చిచెప్పింది. తమ అణుకేంద్రాలపై దాడులు చేసినందుకు గాను ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
అంతేకాదు తమ సైనిక దళాలు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలపై విస్తృత దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నాయని పేర్కొంది. ఇరాన్ గగనతల రూల్స్‌ను బ్రేక్ చేసి అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరించింది. మరోవైపు ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్రావంచి సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులు చేసినప్పటికీ కూడా యురేనియం అభివృద్ధిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంలో తాము నిరుత్సాహపడకుండా యూరేనియం అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు…