ఇరాన్ వైపు దూసుకు వస్తున్న అమెరికా నౌకాదళం…అమెరికా-ఇరాన్ మధ్య కమ్మకుంటున్న యుద్ధమేఘాలు..!

అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ‘USS అబ్రహం లింకన్’ ఇరాన్ వైపు కదులుతోంది. ఇది ఇరాన్‌కు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో, ఇరాన్ తన సైనిక వ్యూహాలకు పదును పెట్టింది…

యుద్ధ నౌకల తరలింపు

సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు ఇప్పటికే ఇరాన్ దిశగా బయలుదేరాయని వెల్లడించారు. ఆ నౌకలు ఎంతో వేగంతో, స్పష్టమైన లక్ష్యంతో కదులుతున్నాయని చెప్పారు. ఇరాన్ ఆలోచించుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉందని, త్వరగా ఒప్పందానికి అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో కంటే దారుణమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఇరాన్ను హెచ్చరించారు.

ఇరాన్ దౌత్య వ్యూహాలు

అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందని గ్రహించిన ఇరాన్, తనను తాను కాపాడుకోవడానికి పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో పడింది. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి సిద్ధమవుతూనే.. పొరుగు దేశాల సహకారం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు కొన్ని కీలక దేశాల నుండి భరోసా లభించింది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు.. ఇరాన్పై దాడి చేయడానికి అమెరికాకు తమ ఆకాశ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఇరాన్కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సిద్ధమైన ఇరాన్

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. ఒకవేళ అమెరికా తమను బలవంతంగా యుద్ధం వైపు నెడితే, తాము కూడా ఊరుకోమని, గతంలో ఎన్నడూ చేయని విధంగా అమెరికాపై ఎదురుదాడి చేస్తామని హెచ్చరించింది. తమ ఆత్మరక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని పేర్కొంది. అయితే అదే సమయంలో తాము శాంతియుత చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతున్నామని కూడా ఇరాన్ ప్రకటించింది..

ఇరాన్‌ అధ్యక్షుడు ఖమేనీకి ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌.

మిస్టర్‌ ఖమేనీ మాట విను.. అమెరికా బాటలో రా.. లేదంటే ఖతమైపోతావ్‌..! టక్కు టమరా మాటలు కాదు. అమెరికన్‌ వార్‌ బెల్‌.. ఇరాన్‌కు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌. మాట విన్నారా సరేసరి. లేదంటే స్మాష్‌ చేయడానికి అమెరికా రెడీ అనేది ట్రంప్‌ ఘాటు ట్వీట్‌ సారాంశం. మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అంటూ.. ఆపరేషన్‌ మిడ్‌ నైట్‌ హ్యామర్‌ గురించి తన పోస్టులో ప్రస్తావించారు ట్రంప్‌. ఇప్పుడు కానీ మాట విని చర్చలతో సంధి బేరానికొస్తే మంచిది. లేదంటే ఆపరేషన్‌ మిడ్‌ నైట్‌ హ్యామర్‌కు మించి ఇరాన్ భారీ నష్టాలను కష్టాలను చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. సమయం లేదు మిత్రమా.. సంధికి చేసుకుందాం రా.. అని హితువు చెప్తూనే.. పంతాలకు పోతే అంతం తప్పదని గట్టిగా హెచ్చరించారు.

న్యూక్లియర్‌ వెపన్స్‌ వద్దు.. అందరికీ మంచి జరిగే ఒప్పందాలను ఒప్పుకోవడమే ముద్దు. ఇరాన్‌కు ఉన్న ఏకైక మార్గం మాట వినడమే. కాదు కూడదని కాలర్‌ ఎగరేసినా.. న్లూక్లియర్‌ వెపన్స్‌ ఉన్నాయని యుద్ధానికి కాలుదువ్వినా సరే ఇరాన్‌పై తాము చేపట్టే సైనిక చర్య మాములుగా ఉండదని ట్రంప్‌ అన్నారు. వెనుజులా చూశారా.. అది ట్రైలర్‌ మాత్రమే. ఇరాన్‌ కయ్యానికి కాలుదువ్వితే వెనిజులాకు మించిన చూపిస్తామన్నారు. అవసరమైతే హింసతో ఆపరేషన్‌ ఫినిష్‌ చేస్తామని స్ట్రాంగ్‌ డోస్‌తో ఇరాన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌.

ఔను నిజమే.. ఉత్తుత్తి మాటలు కాదు ట్రంప్‌ ఆదేశాలతో అమెరికన్‌ సేనలు ఇరాన్‌ చుట్టూ మోహరిస్తున్నాయి. ఇప్పటికే భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఫైటర్ జెట్లు, డ్రోన్ల అమెరికన్‌ బలగాలు ఎనీ టైమ్‌ అటాకింగ్‌ సిద్దంగా ఉన్నాయి. అణుశక్తితో నడిచే భారీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘యూఎస్‌ఎస్ అబ్రహామ్ లింకన్’ ఆధ్వర్యంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, దక్షిణ చైనా సముద్రం నుంచి నార్త్ అరేబియన్ సీ వైపు కదులుతోందని సమాచారం. దాదాపు 80 యుద్ధ విమానాలతో కూడిన ఈ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, అమెరికా చేతుల్లో ఉన్న అత్యంత శక్తివంతమైన యుద్ధ సాధనాల్లో ఒకటి. ఇప్పుడది ఇరాన్‌ను గురిపెట్టింది. మరోవైపు ఇరాన్ కూడా అమెరికాకు ధీటుగా జవాబిచ్చిందుకు రెడీ అవుతోంది. ఇరాన్‌పై ఎలాంటి దాడి జరిగినా అది పూర్తి స్థాయి యుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

ఇరాన్‌ ఎలాంటి వ్యూహాలు పన్నినా సరే.. చివరకు తన మాట వినాల్సిందే. ఒప్పందాల బాటలోకి రావాల్సిందే అనేలా అమెరికా ఓవైపు యుద్ద పావులు కదుపుతోంది. మరోవైపు న్యూక్లియర్‌ వెపన్స్‌ వద్దు.. అందరికీ మంచి జరిగే మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యమని కలరింగ్‌ ఇస్తోంది. మాట విని అమెరికా బాటలోకి రా.. లేదంటే ఖతమే అంటూ ఖమేనీకి ట్రంప్‌ చేసిన హితువుతో కూడిన హెచ్చరికలు సంచలనంగా మారాయి.