లెబనాన్‌పై ఇజ్రాయెలీ దాడులను నిలువరించి కాల్పుల విరమణలో లెబనాన్‌ కూడా భాగమే…ఇరాన్‌ ప్రభుత్వం రెండు షరతులు..!..

ఇరాన్‌తో చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం పాకిస్తాన్‌కు చేరుకుంది. చర్చలు సానుకూలంగా ఉంటాయని భావిస్తునట్టు అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ తెలిపారు. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేఏ చర్చలు ముందుకెళ్లే అవకాశం ఉందని ఇరాన్‌ స్పష్టం చేసింది.

తమ షరతులను నెరవేర్చే వరకు చర్చల్లో వెళ్లేది లేదు ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బఖర్‌ ఘలీబాఫ్‌ శుక్రవారం స్పష్టం చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ, స్తంభింపచేసిన తమ ఆస్తుల విడుదల ముందుగా జరగాలని ఆయన తెలిపారు. ముందుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చర్చలు ముందుకు కదలవని ఆయన స్పష్టం చేశారు. పక్షాల మధ్య పరస్పరం అంగీకారం కుదిరిన రెండు చర్యలు ఇంకా అమలు కాలేదు. అవి లెబనాన్‌లో కాల్పుల విరమణ, చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్‌కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయడం అని ఆయన పేర్కొన్నారు. చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఈ రెండు డిమాండ్లను అమలు చేయాలని ఆయన చెప్పారు. లెబనాన్‌పై ఇజ్రాయెలీ దాడులను నిలువరించి కాల్పుల విరమణలో లెబనాన్‌ కూడా భాగమేనని ఒప్పుకుంటూ తాను ఇచ్చిన హామీలకు అమెరికా కట్టుబడి ఉండాలని ఇరాన్‌ మంత్రి అరాగ్చీ స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగితే విస్తృత కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు..

అమెరికాతో ఆటలొద్దు : వాన్స్‌.

ఇరాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఉపాధ్యక్షుడు వాన్స్‌ శుక్రవారం పాకిస్థాన్‌ బయల్దేరారు. కీలక దౌత్యఘట్టం ఫలప్రదం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మాతో ఆడుకోవాలని చూస్తే చర్చల బృందం అంత సుముఖంగా లేదని వారికి తెలుస్తుంది అని ఇరాన్‌ని ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. అధ్యక్షుడు చెప్పినట్లుగా ఇరానీయులు చిత్తశుద్ధితో చర్చలకు సిద్ధంగా ఉంటే మేము తప్పకుండా మా చేయి చాపుతాము. ఒకవేళ వారు సిద్ధంగా లేకపోతే చర్చల బృందం అంత సానుకూలంగా లేదని వారు గ్రహిస్తారు. మేము సానుకూల చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నాము అని వాన్స్‌ చెప్పారు.

శాంతి చర్చలపై సందిగ్ధత.

చర్చలపై అస్థిరత ఇంకా కొనసాగుతున్నది. అధికారిక ప్రతినిధి బృందం టెహ్రాన్‌ నుంచి బయల్దేరినట్లు వచ్చిన వార్తలను ఇరాన్‌ ఖండించింది. లెబనాన్‌లో ఇజ్రాయెలీ దాడుల నిలిపివేయాలన్న షరతుపైనే చర్చల్లో తాము పాల్గొనే అంశం ఆధారపడి ఉంటుందని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఎవరు వస్తున్నారు?.

ఇస్లామాబాద్‌లో రెండు దేశాల ప్రతినిధులు వేర్వేరు గదుల్లో కూర్చుంటారు. వారి ప్రతిపాదనలను మధ్యవర్తుల ద్వారా మార్పిడి చేసుకుంటారు. అమెరికా ప్రతినిధి బృందంలో వాన్స్‌తోపాటు ప్రత్యేక దూత స్టీవ్‌ విట్కాఫ్‌, సీనియర్‌ సలహాదారు జారెడ్‌ కుష్నర్‌ ఉంటారని అధికారులు తెలిపారు. అయితే ఇరాన్‌ ప్రాతినిధ్యంపై ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతున్నది. ఇప్పటికే ఇస్లామాబాద్‌కు ఒక ప్రతినిధి బృందం బయల్దేరి వెళ్లిందని కొన్ని అంతర్జాతీయ పత్రికలు వెల్లడిస్తుండగా వీటిని ఇరాన్‌ అధికార అధికారులు తోసిపుచ్చారు.

చర్చల సమయంపై ప్రశ్నలు.

చర్చలు ఏర్పాటు చేసిన సమయం, సాధ్యాసాధ్యాలపై ఇరాన్‌ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది. లెబనాన్‌లో జరుగుతున్న పరిణామాలు, అక్కడ ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెలీ సైనిక కార్యకలాపాలకు ఇక్కడి చర్చలకు ఇరాన్‌ లంకె పెడుతున్నది. లెబనాన్‌లో ఇజ్రాయెలీ దాడులు ఆగితేనే ఇస్లామాబాద్‌లో దౌత్యపరమైన పురోగతి ఉంటుందని ఇరాన్‌ పట్టుపడుతున్నది. దీంతో అమెరికా-ఇరాన్‌ చర్చలకు పీటముడి పడుతున్నది. కాల్పుల విరమణ హామీలను ముఖ్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడుల నిలిపివేతను అమలుచేసే వరకు చర్చలను నిలిపివేయాలని ఇరాన్‌ అధికారిక మీడియా సూచించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలయ్యే వరకు అమెరికాతో శాంతి చర్చలు జరిపేందుకు హాజరయ్యే ఉద్దేశమేదీ తమకు లేదని ఇరాన్‌కు చెందిన ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీకి ఓ అధికారి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘేర్‌ ఘటీబాఫ్‌ సహా సీనియర్‌ నాయకులు ఎవరూ చర్చల కోసం బయల్దేరి వెళ్లలేదని ఇరాన్‌ అధికారులు నొక్కి చెప్పారు. అయితే శాంతి చర్చలకు లెబనాన్‌ను ఇరాన్‌ ముడిపెట్టడాన్ని ఇజ్రాయెల్‌ తిరస్కరిస్తున్నది. లెబనాన్‌లో తమ సైనిక కార్యకలాపాలు అమెరికా-ఇరాన్‌ అవగాహన పరిధిలోకి రావని ఇజ్రాయెల్‌ వాదించింది. హెజ్బొల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించే హక్కు తమకు ఉందని ఆ దేశం తెలిపింది. ఈ విభేదాలు లెబనాన్‌ను ఓ కీలకమైన విచ్ఛిన్న రేఖగా మార్చాయి. ఇస్లామాబాద్‌ చర్చలు ముందుకు సాగుతాయా లేక పూర్తిగా కూలిపోతాయా అన్నది దానిపైనే ఆధారపడి ఉంది.

పాక్‌పై ఇజ్రాయెల్‌ అభ్యంతరం
మధ్యవర్తిగా పాక్‌ జోక్యాన్ని ఇజ్రాయెల్‌ కూడా గట్టిగా ప్రతిఘటించింది. ముఖ్యంగా పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ఇటీవ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ను ఓ దుష్టశక్తిగా, మానవాళికి శాపంగా అభివర్ణిస్తూ ఆసిఫ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్‌ దేశంగా పేర్కొన్నారు. దీనిపై విమర్శలు రావడంతో ఆ తర్వాత దాన్ని డిలీట్‌ చేశారు. ఆసిఫ్‌ వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెలీ అధికారులు సున్నితమైన చర్చలను నిర్వహించడంలో పాకిస్థాన్‌ నిష్పాక్షికతను ప్రశ్నించారు.