ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్-2కు సంబంధించిన లూనార్ ఆర్బిటర్ నుంచి తమకు ముఖ్యమైన సమాచారం అందిందని వెల్లడించింది. సూర్యుడి నుంచి వెలువడే కరోనల్ మాస్ ఎజెక్షన్ల (సీఎంఈలు – CMEs) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని మొట్టమొదటి సారిగా చంద్రయాన్-2 లూనార్ ఆర్బిటర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ఆర్బిటర్లో ఉన్న అట్మాస్పియరిక్ కంపోజిషన్ ఎక్స్ప్లోరర్-2 (ఛేస్ 2 – CHACE 2) అనే పరికరం ఈ సమాచారాన్ని సేకరించిందని పేర్కొంది.
2024 సంవత్సరం మే 10న కొంత సమయం పాటు ఎడతెరిపి లేకుండా చంద్రుడిపై సూర్యుడి కరోనల్ మాస్ ఎజెక్షన్ల ప్రభావం పడినట్లు గుర్తించామని ఇస్రో వెల్లడించింది. ఇలా జరగడం చాలా అరుదని తెలిపింది. చంద్రుడి బాహ్య భాగం (లూనార్ ఎక్సోస్పియర్) అంతా వివిధ వాయువులతో నిండి ఉంటుంది. కరోనల్ మాస్ ఎజెక్షన్ల ప్రభావం వల్ల చంద్రుడి బాహ్య భాగంలో పీడనం గణనీయంగా పెరిగిందని ఇస్రో పేర్కొంది. దీంతోపాటు చంద్రుడి బాహ్య భాగంలోని తటస్థ ఆటమ్స్, మాలిక్యూల్స్కు చెందిన సంఖ్యా సాంద్రత సైతం అసాధారణంగా పెరిగిపోయిందని నివేదించింది