ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు…

ఇజ్రాయెల్‌-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్‌ మరోసారి ఇరాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయాలు లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆయా కార్యాలయాల సమీపంలోనే బాంబులు పేలినట్లు సమాచారం. ఈ దాడులు జరిగిన టైంలో కార్యాలయంలో ఖమేనీ ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. అమెరికాతో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు.

ఇరాన్‌లో నిలిచిపోయిన మొబైల్‌ సేవలు
మరోవైపు టెహ్రాన్‌‌పై ఎటాక్ జరిగిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. ప్రస్తుతం టెహ్రాన్ నగరమంతటా సైరన్లు మోగుతున్నాయని, బాంబు పేలుడు శబ్దాలను విన్నామని తమ కథనాల్లో పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ వెంటనే గగనతలాన్ని మూసివేసింది. దీంతోపాటు తమ దేశంలో మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించింది.
ఇరాన్‌పై ఎటాక్ చేశాం : ఇజ్రాయెల్
తాము ఇరాన్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పులను తొలగించేందుకే ఈ ఎటాక్స్ చేశామని స్పష్టం చేశారు. టెహ్రాన్‌పై తాము చేసిన దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు అనేది ఇంకా స్పష్టంగా తెలియదని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ దాడిపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు.

ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి…

ఈనేపథ్యంలో యావత్ ఇజ్రాయెల్‌లో ఆయన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుందనే ఆందోళనలతో ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నారు. అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. బంకర్లలో దాక్కోవాలి అంటూ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపుతోంది. వెంటనే ఇజ్రాయెల్, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుందా ? చేయదా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమ దేశంపై దాడి జరిగితే, ఊరుకునేది లేదని బలంగా ప్రతిఘటిస్తామని గతంలో ఇరాన్ హెచ్చరించింది. ఈనేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడి తప్పక చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.