అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో దాడులు కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది..లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్ ప్రభుత్వం అత్యంత కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధిని ఇరాన్ మరోసారి మూసివేస్తున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది.
లెబనాన్‌లో మారణకాండ..
అమెరికాతో కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై చరిత్రలోనే అత్యంత భారీ దాడులకు తెగబడింది. 10 నిమిషాల వ్యవధిలోనే వందకు పైగా ఎయిర్‌స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై అతిపెద్ద దాడి ఇదేనని అక్కడి భద్రతా దళాలు స్టేట్మెంట్ను విడుదల చేశాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా, ఇరాన్ దాడుల నిలిపివేతను ప్రకటించినప్పటికీ.. ఇరాన్, యూఏఈ (UAE), కువైట్, బహ్రెయిన్లలో తాజా దాడులు జరిగినట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ పరిణామాలు కాల్పుల విరమణ ఒప్పందం మనుగడపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా.. ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ గుండా నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతించాలని ట్రంప్ షరతు విధించారు. దీనిపై తుది చర్చలు ఈ శుక్రవారం ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి.
ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన..
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరులో లెబనాన్ తీవ్రంగా దెబ్బతింటోంది. ఇరాన్ మద్దతు ఉన్న దేశాలపై ఇజ్రాయెల్ దాడులు పెంచడంతో.. ఇరాన్ తన సైనిక, భౌగోళిక బలంతో ప్రపంచ దేశాలను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు కాస్త తగ్గి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే, తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా ఇరాన్ మళ్లీ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో, రానున్న రోజుల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి..
ఇరాన్ మద్దతు గల హిజ్బొల్లాతో సాగుతున్న పోరాటం కూడా ఈ ఒప్పందం పరిధిలోకి వస్తుందనే వాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు.
దీనిపై లెబనాన్ ప్రభుత్వం, హిజ్బొల్లా స్పందించాల్సి ఉంది.
అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ మాత్రం, ఒప్పందం లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని సంకేతాలిచ్చింది.
ఒప్పందంలో లెబనాన్‌ను కూడా చేర్చాలని హిజ్బొల్లా గతంలోనే ఇరాన్‌ను కోరినట్లు రిపోర్టులున్నాయి.
మరోవైపు, సరిహద్దు వెంబడి లెబనాన్ భూభాగంలో ‘సెక్యూరిటీ బఫర్ జోన్’ ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.
ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే లెబనాన్‌లోకి ప్రవేశించడంతో, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్తాయనే ఆందోళనలు ఉన్నాయి.