నేటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం.
వ్యక్తిగత డేటా గోప్యతకు భద్రత ఇస్తామన్న కేంద్రం.
మే 1 నుంచి 30 వరకు ఏపీలో జనగణన.
మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో కార్యక్రమం..
రెండోదశలో కులం వివరాలు సేకరిస్తామన్న కేంద్రం.
దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి తొలి దశగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సాంకేతిక ఆధారిత విధానంతో ప్రజలే స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది. ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో భాగంగా ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న ‘సెన్సస్-2027’ మొబైల్ యాప్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, విద్య, ఉపాధి, నివాస పరిస్థితులు, సామాజిక-ఆర్థిక సమాచారం వంటి కీలక అంశాలను నమోదు చేసుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా డేటా సేకరణలో ఖచ్చితత్వం, పారదర్శకత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.
మే 1 నుండి ఇంటింటి సర్వే..
జన గణనలో రెండో దశలో భాగంగా మే 1వ తేదీ నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో నమోదు చేయని కుటుంబాలను గుర్తించి, ఫీల్డ్ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందిని నియమించారు. జిల్లాలో ఈ భారీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు 20 మంది చార్జ్ సెన్సస్ అధికారులను నియమించారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు 16 మంది, పట్టణ ప్రాంతాలకు నలుగురు అధికారులను కేటాయించారు. ప్రతి 200 కుటుంబాలను ఒక ఎన్యూమరేషన్ బ్లాక్గా విభజించి, క్రమబద్ధంగా సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.