జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపబోరు… కేటీఆర్..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపబోరని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టంచేశారు. కేసీఆర్‌ బలపరిచిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతమ్మ విజయకేతనం ఎగురవేయడం తథ్యమని తేల్చిచెప్పారు. ‘రెండేండ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేసిందని ఆ పార్టీకి ఓటేస్తారు.. తులం బంగారం ఇవ్వనందుకా? మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ అమలు చేయనందుకా? యువతులకు స్కూటీలు ఇవ్వనందుకా? మహిళలకు రూ.2500 ఇవ్వనందుకా? నగరాభివృద్ధికి రూ. 6వేల కోట్లు ఇవ్వనందుకా? ముస్లింలకు రూ.4వేల కోట్లు కేటాయించనందుకా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డి రెండేండ్లలో చేసిన అరాచకాలను చూసిన ప్రజలు ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారనుకోవడం అత్యాశేనని పేర్కొన్నారు.

ఆదివారం సాయంత్రం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్‌ మాట్లాడుతూ నవంబర్‌ 14న వెలువడే ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని జోస్యం చెప్పారు. మైనార్టీలు బీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారని భావించి రేవంత్‌రెడ్డి అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని చెప్పారు. అజార్‌కు ఈ పదవి రావడానికి బీఆర్‌ఎస్సే కారణమని, అజారుద్దీన్‌ కేసీఆర్‌ ఫొటో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటేనని, ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్‌ పదవిని బీజేపీ అడ్డుకుంటున్నదనే వాదనలు రేవంత్‌రెడ్డి లాంటి అల్పులకు వచ్చే చిల్లర ఆలోచనలని విమర్శించారు. తాము ఆ పదవిని స్వాగతిస్తున్నామని చెప్పారు. మాగంటి గోపీనాథ్‌ 16000 పైచిలుకు ఓట్లతో గెలిచారని, ఇప్పుడు ఊహించనివిధంగా భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్నదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరే కీలకం కానున్నదని, హిందూ, ముస్లిం తేడా లేకుండా బీఆర్‌ఎస్‌కు మద్దతు లభిస్తుందని పునరుద్ఘాటించారు..