జూబ్లీహిల్స్ నా ఇల్లు.. నా ప్రాంతం.. ఎక్కడినుంచో వచ్చి నన్ను టార్గెట్ చేస్తే.. మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీదాటరు. మీరు మీ ఇల్లు చూడరు’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపులకు పాల్పడ్డారు. .
‘నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే ఖబర్దార్..’ అంటూ నవీన్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలు జూబ్ల్లీహిల్స్లో కలకలం రేపుతున్నాయి. తన ఏరియా జూబ్లీహిల్స్‌కు ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారంటూ ఇతర ప్రాంతం నుంచి వచ్చినవారిపై అక్కసు వెళ్లగక్కారు. నవీన్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచా రం చేస్తున్నవారంతా పూర్తిగా ఇదే ప్రాంతం వారా? బయటనుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇదే వార్నింగ్ వర్తిస్తుం ది కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. తనకు టికెట్ ఖరారైన వెంటనే ‘పీజెఆర్ నాన్‌లోకల్’ అంటూ వ్యాఖ్యానించిన నవీన్‌యాదవ్‌పై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకుని ఉన్నది. ఆ వ్యాఖ్యలు మరవకముందే లోకల్, నాన్‌లోకల్ అంటూ కామెంట్లు చేయడం, బయటనుంచి వచ్చినవారు మళ్లీ మీ ఇల్లు చూడరంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం వేలాదిమంది సెట్లర్లలో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు పోలింగ్ తేదీకి 48 గంటల ముందు వరకు బయటప్రాంతాల వ్యక్తులు రావడం సహజమని, ఇలాంటి అనుచిత కామెంట్లతో బెదిరించడం సమాజానికి ఏం సందేశం ఇస్తుందనే చర్చ జరుగుతున్నది…