జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌యాదవ్‌ సొంత తమ్ముడు కి మూడు ఓట్లు.. కేటీఆర్.

జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌యాదవ్‌ సొంత తమ్ముడు వెంకట్‌ ప్రవీణ్‌కుమార్‌కు మూడు ఓట్లు ఉన్నాయని రెండు జూబ్లీహిల్స్‌లో, ఒకటి రాజేంద్రనగర్‌లో ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. WKH4226320 కార్డు నంబర్‌తో ఒకటి, WKH3126018 నంబర్‌తో రెండోది, WPK4555355 నంబర్‌తో ఒకటి కలిపి మొత్తంగా మూడు ఓటర్‌ కార్డులు ఉన్నట్టు చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని రెండు కార్డుల్లో ఆయన పేరు, తండ్రి పేరు ఒకటే కానీ, ఇంటి నంబర్లు వేరుగా ఉన్నాయని తెలిపారు. ఒకదాంట్లో 8-3-229/2/4 ఉండగా, మరో ఐడీ కార్డులో 8-3-229/S/3/5గా నమోదు అయినట్టు చెప్పారు. ఒకదాంట్లో ఇంటి అడ్రస్‌ అని పేర్కొనగా, మరో కార్డులో ఆఫీస్‌ అడ్రస్‌గా పేర్కొన్నారని తెలిపారు. ఇంతకంటే అరాచకం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఓటరు జాబితాతో ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎలక్షన్‌ అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఎలక్షన్‌ కమిషన్‌ ముందుకు వెళ్తున్నాయని విమర్శించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ ఓట్‌ చోరీపై మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ తొక్కుతున్న అడ్డదారులను సాక్ష్యాలతో ప్రజల ముందు పెడతామని చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని తేల్చి చెప్పారు..