*కాశీ మజిలీ కథలు – మొదటి మజిలీ… 12*
దేవతావస్త్రముల కథ
బుద్దిశాలులగు వరప్రసాదు లొక్కయుపాయంబున నా నృపతిని వంచింపఁ దలచి యొకనాఁడు పెందలకడ భోజనములు జేసి గౌరవమైన వేషములు వేసుకొని రాజుగారి హజారముకడ నిలువంబడి యొకచీఁటిలోఁ గొన్నివిషయములు వ్రాసి ద్వారపాలురచేతి కిచ్చి రాజున కంపుటయు నాచీఁటి చూచుకొనిన తక్షణము రాజుగారు వారిఁ దోడితెచ్చుట కొకయుద్యోగస్థుని బంపిన నతఁ డత్యంతగౌరవముగా వారి దోడ్తెచ్చి రాజుగారి సింహాసనప్రాంతమందు విడచెను.
రాజును వారి కెదురేగి గౌరవముగా మన్నించి యుచితపీఠికలఁ గూర్చుండఁబెట్టి స్వాగతపూర్వకముగా నిట్లనియె. పురుషవర్యులారా! మీర లెద్దేశము వా రెచ్చటనుండి యెచ్చటి కరుగుచు నిచ్చటి కెప్పుడు వచ్చితిరి? కులగోత్రనామంబు లెట్టివో యెఱింగింపుఁడు. మఱియు మీరు చీఁటిలో వ్రాసిన వింతపను లేమి చేయగలరని యత్యంతాతురముగా నడుగుటయు, వాక్పాటవముగల మంత్రిసూనుండు లేచి సభాసదులకు మ్రొక్కి రాజుదిక్కు మొగంబై యిట్లనియె.
రాజేంద్రా! మాది కాశ్మీరదేశము. పట్టుసాలికులమువారము. విచిత్రములగు బట్టలు నేయఁగలము. అట్టి పనితో మిగుల గౌరవముగా మా దేశపు రాజుగారియొద్ద నుండువార మతని కిప్పు డొకయాపద సంభవించుటచే నటనుండక మమ్ము రక్షించువారెవ్వరని యరయుచుండ యపూర్వచర్యాభిలాషులును నూతనమార్గనిర్మాణదక్షులును నగు మీ కీర్తి దిగంతవిశ్రాంతమై మా కర్ణగోచర మగుటయు వింతకార్యముల నొనరించుటయందు వేడుకగల మీరుగాక మా యపూర్వవిద్య పరీక్ష సేయు దక్షు లన్యులు లేరని నిశ్చయించి యుష్మద్దర్శనార్ధులమై యీదేశ మరుగుదెంచితిమి.
మా పుణ్యవశమున మిమ్ము బొడఁగంటిమి. సెలవైనయెడ చమత్కృతి వక్కాణింతుమనుటయు నట్టి మాటలకు నారాజు మిగుల నానందించి మంత్రిదిక్కు మొగంబై దుర్బుద్దీ! మన నూతనచర్యాస్థాపనవలన నెట్టి ఖ్యాతి కలిగినదో వింటివా? మనకుఁ గడుదూరముగానున్న కాశ్మీరదేశములో సైతము మనపేరు వాడుకపడియున్న దఁట మేలుమేలని సంతసించు రాజుతో మంత్రి యిట్లనియె.
దేవా! కాశ్మీరదేశ మొకటననేల? భూమండలమంతయు మన పేరుప్రతిష్ఠలు వ్యాపకమైయున్నవి. ఆయాదేశములనుండి వచ్చుచున్న వార్తాపత్రికలవలన నవ్విధమెల్లఁ దెల్లమగుచున్నది. తమకుఁగల బుద్ధికుశలత మఱియొకరాజునకుఁ గలదా? ఎప్పుడును గ్రొత్తమార్గములే విమర్శింపుచుందురు గదా? దీని మూలమునఁ దమకు శిబి, కర్ణ, బలి ప్రముఖులకు దాతృత్వము వచ్చినదానికన్న నధికమగు యశంబు రాఁగలదని పెక్కు స్తోత్రపాఠములు పఠించిన మంత్రి మాటలను రాజు విని పరమానందభరితు డయ్యెను. వరప్రసాదులు నవ్వుకొని నామాటల ననువదించిరి. అప్పుడు రాజు వారితోఁ గోవిదులారా! మీ విద్యాపాటవం బెట్టిదో యెఱింగింపుఁడు. అపూర్వ మని తోచినచో మిమ్ము తప్పక భరింతునని పలుకుటయు మంత్రి పుత్రుండగు రాము డిట్లనియె.
అయ్యా! మే మాఱుమాసముల కొకదోవతులచాపు చీరయుఁ దలరుమాలును నేయుదుము. ఆ పుట్టములకు నేఁబదివేల మాడలు వ్యయమగును. అందు ముందుగా సగము సొ మ్మీయవలయును. బట్టలనేత ముగిసినతోడనే మే మెవ్వఱికి నేయుదుమో యా యజమానుఁడు భార్యతోఁ దనకుఁగల వైభవమున నొకసాయంకాలమం దూరేగి మా బసలోనికి వచ్చి మా కియ్యవలసిన సొమ్ముతో నోపినంత బహుమతిం గూడ నియ్యఁదగినది. పిమ్మట నాపుట్టముల మేమే వారికిఁ గట్టుదుము. ఆ పుట్టంబులం గట్టికొని యూరంతయు నూరేఁగి యా రాత్రి భార్యాభర్తలు కామకేళిం దేలినచోఁ దత్ప్రభావంబున వారి కధికతేజస్పమన్వితుండగు నందనుం డుదయించును. మఱియు నొకవిశేష మాకర్ణింపుడు. మేము నేయుబట్టలు గాని నూలు గాని జారత్వదోషమువలన జనించినవారికి మాత్రము గాన్పింపవు. అవి దేవతావస్త్రములు. ఇట్టి చాపుల నేఁటి కొకసారి నేసి మా రాజుగారివలన మిగుల గౌరవ మందుచుందుము. దైవప్రాతికూలమున నతండు చిక్కులంబడియుండుటం బట్టి యింతదూరము రావలసి వచ్చినది. ఆ పుట్టంబులఁ గట్టినప్పుడుగాని యయ్యానందము సెప్పినం దీరదు. ఇందుల కొడంబడుదురేని నిందుండెదము లేనిచో సెలవీయుఁడు. వేఱొక యాస్థానమున కరిగెద మనుటయు నపుత్రకుండును నూతనమార్గస్థాపకుండు నగుటచే దానఁ దనకు గొప్ప ఖ్యాతి రాగలదనియు నట్టి ప్రభావము లేకున్న నొకచాపునకు చీరకు నంతవెల యేల యడుగుదురనియు మనంబునఁ జింతించి వా రట్టి ప్రభావసంసన్ను లగుదురని నిశ్చయించి వారితో నిట్లనియె.
ఓ తంతువాయకులారా! మీ కావిషయమై వితర్క మేమిటికి! మా సంస్థానమునకు వచ్చిన విద్వాంసు లూరక చనుట వలదా? రాత్రింబవళ్ళ మార్చి మిగుల విఖ్యాతిఁ జెందుచున్న నాకుఁ గ్రొత్తపనులకునై యెంత సొమ్మైనను లక్ష్యమా? మీ యిష్టము వచ్చినంత సొమ్ము వ్యయపెట్టి యట్టి యద్భుతవస్త్రంబుల నేసియిండని యానతిచ్చి వారు కోరినంత ద్రవ్యం బిచ్చి సబహుమానముగా నెలవున కనిపెను.
వింతబట్టల నేయఁగల పట్టుసాలీలు వచ్చినారని గ్రామమంతయు వదంతియగుటచే నట్టి వసనంబులు చూచుటకు పౌరులకుఁగూడ మిగుల నాతురముగా నున్నది. వరప్రసాదులును నేతసాధనములగు వేమాదండములు రాట్నములు మగ్గములు కండె గుల్లలు లోనగునవి మాత్రము సంగ్రహించిరి. వాకిట తమ యాజ్ఞలేక యన్యుల రానీయకుండునటుల కావలివానిం బెట్టి లోపల నిష్టమైన వినోదములతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి.
ఇట్లుండునంత రెండుమాసములయిన పిమ్మట కానీన నృపాలుఁ డొక్కనాఁ డాపుట్టముల పని యెంత యైనదో యని తెలిసికొన వేడుకపడుచు నవ్విశేషములఁ జూచి రండని గ్రామాధికారుల వారియొద్ద కనిపెను. అట్టి పుట్టంబులం జూడ వారికిని మిగుల వేడుకగా నుండుటచే సత్వరముగా వరప్రసాదుల నెలవున కఱిగి కావలివానిచేఁ దమరాక వారి కెఱింగించిరి.
వరప్రసాదులును ముహూర్త మాత్రము నిలిపి తీసికొనిరమ్మని కావలివానికాజ్ఞ యిచ్చి యింతలో రాట్టములు దోడుబద్దలు సర్దుకొని వట్టిరాట్టముల నూలొడుకువారివలెఁ ద్రిప్పుచు నూలుచుట్టువారివలెనే తోడుబద్దలకుఁ జుట్టుచుండిరి. అంతలో గ్రామాధికారులు లోనికి వచ్చిరి. అప్పుడు రాముఁ డెదురువోయి సముచితసత్కారముల వారిం గౌరవించి తగుపీఠములఁ గూర్చుండబెట్టి కొండొకవడికి నావట్టిచుట్టుబద్దలు వారికి జూపించుచు నిట్లనియె.