కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐజీ అస్రాగార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ తొక్కిసలాట ఘటనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో టీవీకే పార్టీ(tvk) అధ్యక్షుడు విజయ్ పేరును ఎందుకు చేర్చలేదంటూ దాఖలైన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే నేతలందరూ ఘటనా స్థలం దగ్గర నుంచి వెళ్లిపోవడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ప్రమాదాన్ని పట్టించుకోకుండా పార్టీ నేతలందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడం, వాళ్ల ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని కఠినంగా వ్యాఖ్యానించింది.
విజయ్ పట్ల అంత ఉదాసీనత ఎందుకు?
కరూర్ తొక్కిసలాటలో 41 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విజయ్ పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తోందని న్యాయస్థానం మండిపడింది. ‘కరూర్లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా?’ అని హైకోర్టు కార్యక్రమ నిర్వాహకులను, పోలీసులను ప్రశ్నించింది. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా మేం కళ్లు మూసుకుని ఉండలేమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు టీవీకే నాయకులు బుస్సీ ఆనంద్, సీటీఆర్ నిర్మల్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆదేశాలను రిజర్వ్ చేసినట్లు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ తెలిపారు.
బహిరంగ సభలపై మధ్యంతర ఉత్తర్వులు
తొక్కిసలాట ఘటనపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన మద్రాసు హైకోర్టు తమిళనాడులో బహిరంగ సభలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, జాతీయ రహదారులపై బహిరంగ సమావేశాలు సహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (ఎస్ఓపీ) రూపొందించే వరకు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేటాయించిన ప్రదేశాలు మినహా జాతీయ రహదారులపై భేటీలకు అనుమతించబోమని తేల్చిచెప్పింది.
సీబీఐ దర్యాప్తునకు నో
మరోవైపు తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తుచేసింది. ఇప్పుడే సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది. విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు మద్రాస్ హైకోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు, సమావేశాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, నిష్క్రమణ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది.