ఈవీఎంలపై కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఆ పార్టీ ఎదురుదాడి చేసింది. సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన సమస్యలపై ఆయన వైఖరి మారిందని కాంగ్రెస్ విమర్శించింది..(Congress vs Omar Abdullah) ఒక ఇంటర్వ్యూలో ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ ఖండించారు. ‘ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడింది సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ (ఎస్పీ) , శివసేన (యూబీటీ)లే. ఒమర్ అబ్దుల్లా దయచేసి మీ వాస్తవాలను పరిశీలించండి. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ తీర్మానం ఈసీఐని మాత్రమే స్పష్టంగా సూచించింది. సీఎం అయిన తర్వాత భాగస్వామ్య పార్టీల పట్ల ఈ విధానం ఎందుకు?’ అని ఎక్స్ పోస్ట్లో ప్రశ్నించారు.
కాగా, ఒమర్ అబ్దుల్లా ఆదివారం పీటీఐకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ తరచూ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఓటింగ్ పద్ధతిని ప్రశ్నించడంలో స్థిరంగా ఒక విధానానికి కట్టుబడి ఉండాలని అన్నారు. గెలిచినప్పుడు సంబరాలు చేసుకుని, ఓడినప్పుడు విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ను ఎద్దేవా చేశారు. ఓటింగ్ పద్ధతిపై నమ్మకంలేని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకూడదని సూచించారు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు స్పందించింది..