కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు జంక్షన్లలో అండర్‌పాస్‌లు, స్టీలు ఫ్లైఓవర్లు నిర్మించే పనుల రద్దు..
ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు..
రాజధాని నగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి రోడ్డును కలుపుతూ ఆరు లేన్లతో 4 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు జంక్షన్లలో అండర్‌పాస్‌లు, స్టీలు ఫ్లైఓవర్లు నిర్మించే పనులను రద్దు చేసి దాని స్థానంలో పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతించింది. ఆ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు..పంజాగుట్ట, హైటెక్‌సిటీ మధ్య ప్రతి రోజు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఆయా వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్, ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్కు, జూబ్లీ చెక్‌పోస్టు జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల కారణంగా రోజూ 20 నిమిషాలు ఆగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేబీఆర్ పార్కు చుట్టూ కూడళ్లలో స్టీలు బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అవి వేగం పుంజుకున్న దశలో వాహనాల దారి మళ్లింపులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టిన వన్ వే విధానం వ్యవహారాన్ని పూర్తిగా మార్చేసింది. పార్కు చుట్టూ వాహనాలు సాఫీగా సాగిపోతుండటంతో అధికారులు వన్ వే విధానాన్ని శాశ్వతం చేశారు. కేబీఆర్ అభివృద్ధి ప్రాజెక్టును రద్దు చేయాలని, బదులుగా ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలన్న జీహెచ్ఎంసీ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.