ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets)లో ఒకటైన బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది…సాంకేతిక సమస్య కారణంగా ల్యాండ్ అయిన ఈ జెట్ గత 10 రోజులుగా భారత్‌లోనే నిలిచిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ బ్రిటిష్ జెట్‌కు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిరంతరం భద్రత కల్పిస్తున్నారు.
అయితే ఆ జెట్‌లో సమస్య ఏంటి..? ఇన్ని రోజులు ఎందుకు చిక్కుకుపోయిందన్న విషయంపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. గత పది రోజులుగా తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ఆరుబయటే ఈ జెట్‌ను పార్క్ చేశారు. దీంతో దాన్ని హ్యాంగర్‌కు తరలించమని భారత్ చేసిన విజ్ఞప్తిని బ్రిటన్ నేవీ (UK Navy) సున్నితంగా తిరస్కరించింది. ఈ ఫైటర్ జెట్ సాంకేతికత గురించి ఆందోళన కారణంగా వారు ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలిసింది. తుది తనిఖీల సమయంలో మాత్రం దీన్ని హ్యాంగర్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది.
బ్రిటన్ దేశానికి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ ఇటీవల ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత నేవీతో కలిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేసింది. బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన ఆ నౌకలోని యుద్ధ విమానం ఎఫ్-35 ఇంధనం తగ్గడంతో జూన్ 14న తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని ముందుగా వార్తలు వినిపించాయి. అయితే, ఇన్ని రోజులు అది ఇక్కడే ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.
ఆ ఫైటర్ జెట్‌లో సమస్యను సరిచేసిన తర్వాత తిరిగి హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పైకి చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫైటర్జెట్కు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నది. మన దేశంలో ఓ విదేశీ యుద్ధ విమానం ఐదు రోజులపాటు నిలిచిపోవడం, అందులోనూ ఎఫ్-35 లాంటి 5వ తరం స్టెల్త్జెట్ మోరాయించడం సాధారణ విషయం కాదు. కాగా ఈ విమానం షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా దీనిలోనే మరో వేరియంట్ విమానాన్ని ఇరాన్‌పై దాడులకు వాడుతున్నది..
హైడ్రాలిక్ సమస్యలే కారణమా?
ఈ బ్రిటిష్ F-35B జెట్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విన్యాసాల్లో పాల్గొంటోంది. జెట్ తక్షణ సహాయం అవసరమన్న సంకేతంగా SQUAWK 7700 ట్రాన్స్‌పాండర్ కోడ్ ప్రసారం చేసినట్టు సమాచారం. భారత వైమానిక దళం అన్ని అవసరమైన టెక్నికల్ గా సహాయం అందించినప్పటికీ, హైడ్రాలిక్ సమస్యల వల్ల జెట్ మళ్లీ ఎగరలేకపోయింది. గ్రౌండ్లో జెట్‌ను మరమ్మతు చేయలేకపోయిన బ్రిటిష్ టెక్నికల్ నిపుణులు చివరికి దాన్ని UKకి సైనిక రవాణా విమానంలో పంపించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. కాగా ఇంత అత్యంత అధునాతన ఫైటర్ జెట్ లో సమస్యలు తలెత్తడంతో బ్రిటిష్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే F౩5 షార్ట్ టేకాప్, వర్టికల్ ల్యాండింగ్ చేయగల సామర్థ్యమున్న అత్యంత అధునాతన ఫైటర్ జెట్ ఇది. వీటిని నాటో సభ్యదేశాలు ఉపయోగిస్తున్నాయి..