కీరవాణి సంగీత దర్శకత్వంలో గ్లోబల్ సమిట్‌పై గీతం..

కీరవాణి సంగీత దర్శకత్వంలో గ్లోబల్ సమిట్‌పై గీతం

సమిట్‌పై నాలుగు భాషల్లో ప్రత్యేక గీతం ఉంటుందని తెలిపిన సీఎస్ సంజయ్ జాజు

కీరవాణి సంగీత దర్శకత్వంలో దీన్ని రూపొందిస్తున్నట్లు.. డిసెంబర్ 7, 9 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపిన సీఎస్ సంజయ్ జాజు..

హైదరాబాద్‌లో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంస్కృతి మరియు పెట్టుబడుల అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా నాలుగు భాషల్లో ఒక ప్రత్యేక ప్రచార గీతాన్ని (థీమ్ సాంగ్) ప్రభుత్వం రూపొందిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ ప్రత్యేక గీతాన్ని స్వరపరుస్తూ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించే ఈ సమ్మిట్ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ఈ గీతం ఉండబోతోంది…కేవలం వ్యాపార, పెట్టుబడుల చర్చలకే పరిమితం కాకుండా, దేశ విదేశాల నుంచి విచ్చేసే అతిథులకు తెలంగాణ కళా వైభవాన్ని పరిచయం చేసేందుకు సమ్మిట్‌లో భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. దీనితో పాటు సమ్మిట్ ప్రాంగణంలో అతిథుల కోసం ప్రత్యేకంగా 30 స్టాళ్లను ఏర్పాటు చేసి, వాటిలో తెలంగాణ రుచికరమైన సంప్రదాయ వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులకు ఒక మరుపురాని అనుభూతిని అందించేలా ఆతిథ్యం, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు కీరవాణి సంగీతంతో కూడిన ఈ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా కృషి చేస్తోంది…