దేశంలో డీలిమిటేషన్‌కు రంగం సిద్ధమైంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లు మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ…గతంలో వీగిపోయిన ఈ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు మోడీ సర్కార్ పక్కా వ్యూహాం రచించి దీనిని ఆమోదం తెలిపేలా చేసినట్టుగా కేంద్ర వర్గాలు తెలుపుతున్నాయి..
నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. డీలిమిటేషన్ గైడ్‌లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచే అవకాశముంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుంచి 25కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి.
హైదరాబాద్, శివారు జిల్లాలకే ఎక్కువ సీట్లు
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం కేవలం మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమైంది. హైదరాబాద్ (1.05 కోట్లు), రంగారెడ్డి (53 లక్షలు), మేడ్చల్ మల్కాజిగిరి (35 లక్షలు) జిల్లాల మొత్తం జనాభా 1.93 కోట్లుగా ఉంది. అంటే రాష్ట్రంలోని మొత్తం 179 సీట్లలో దాదాపు 90 సీట్లు కేవలం ఈ మూడు జిల్లాల పరిధిలోనే వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతమున్న నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గాన్ని రెండు లేదా మూడు ముక్కలు చేసి కొత్త స్థానాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అత్యధిక జనాభా కలిగిన హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న 15 సీట్లు ఏకంగా 49కి, రంగారెడ్డిలో 8 నుంచి 25కి, మేడ్చల్ మల్కాజిగిరిలో 5 నుంచి 16కి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి.
మెజారిటీ లోక్‌సభ సీట్లు కూడా ఈ మూడు జిల్లాల్లోనే పెరుగుతాయి. ఉదాహరణకు సుమారు 46లక్షల జనాభా ఉన్న మల్కాజ్గిరి సుమారు 3 నియోజకవర్గాలుగా విడిపోనుంది. నల్గొండ (16.80 లక్షలు), నిజామాబాద్ (15.90 లక్షలు), ఖమ్మం (14.80 లక్షలు) వంటి పెద్ద జిల్లాల్లోనూ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. జిల్లాకేంద్రాల్లో ఉన్న జనాభా దృష్ట్యా అర్బన్ నియోజకవర్గాల సంఖ్య పెరిగి, రూరల్నియోజకవర్గాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ములుగు జిల్లా అంతా ఒకటే నియోజకవర్గం ఉండగా, పునర్విభజన తర్వాత రెండుకు చేరే అవకాశముంది… మొత్తానికి తెలంగాణలో కూడా ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ఉన్న నేతలకి ఏదో మంచి అవకాశం అని కూడా రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది..