కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న పీసీసీ క్రమశిక్షణ కమిటీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి వివరణ కోరనున్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి..
గత కొంతకాలంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తనకు మంత్రి పదవి కావాలని బహిరంగంగానే పలు వేదికల్లో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనికి తోడు సమయం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని తెలియజేస్తూనే ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఇవాళ రాజగోపాల్రెడ్డితో ఫోన్లో మాట్లాడనున్నారు. తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శలు.?
:రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని కానీ, నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. తనకు పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని, అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కావాలా? మునుగోడు ప్రజలు కావాలా? అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని తెలిపారు.