కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ కారణంగా సంభవించిన భారీ ‘బ్లో అవుట్’ ప్రమాదం స్థానిక రైతులను కోలుకోలేని దెబ్బతీసింది…మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఎగసిపడుతున్న మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ఈ ప్రమాద తీవ్రతకు పచ్చని కొబ్బరి తోటలు మాడిమసైపోతున్నాయి.
ఇరుసుమండలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్ పైప్లైన్ వద్ద గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ, వేడితో నిండిపోయింది. ఈ మంటల ధాటికి సుమారు 500కు పైగా కొబ్బరి చెట్లు పూర్తిగా కాలి బూడిదనైట్లుగా తెలుస్తోంది..
కేవలం కాలిపోయిన చెట్లే కాకుండా, మంటల నుంచి వస్తున్న విపరీతమైన వేడికి చుట్టుపక్కల తోటల్లోని కొబ్బరి చెట్లు కూడా దెబ్బతింటున్నాయి. వేడి తీవ్రత తట్టుకోలేక చెట్లపై ఉన్న కొబ్బరి బోండాలు నేల రాలుతున్నాయి. దీంతో పంట చేతికి రాకుండానే నాశనమవుతోందని రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ ఘటనపై కొబ్బరి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఒకప్పుడు కోనసీమలో రెండు ఎకరాల కొబ్బరి తోట ఉంటే కోటేశ్వరుడితో సమానంగా బతికేవాళ్లం. కానీ ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మా తోటలు కళ్ల ముందే కాలిపోతున్నాయి. మేం పూర్తిగా నష్టపోయాం.” అని రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో పంట దిగుబడిపై ఈ ప్రమాద ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, నష్టపోయిన తమను ఆదుకోవాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ONGC కూడా దీనిపై అధికారికంగా స్పందించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తమ అత్యున్నత స్థాయి బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని.. సాంకేతిక సమస్యలను పరిష్కరించే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది.
ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇరుసుమండ గ్రామంతో పాటు సమీపంలోని లక్కవరం తదితర గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. వారిని సమీపంలోని కళ్యాణ మండపాలు, సురక్షిత భవనాల్లో తాత్కాలికంగా ఉంచారు. మంటల వేడికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పంట పొలాలు, ఆక్వా సాగుకు కూడా గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అగ్నికీలల్లో డ్రిల్లింగ్ రిగ్, లాగింగ్ టూల్స్, భారీ వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రస్తుతం బావిలో 20 వేల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ నిల్వలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్యాస్ ఒత్తిడి తగ్గే వరకు మంటలను పూర్తిగా ఆర్పడం కష్టమని వారు స్పష్టం చేస్తున్నారు. మంటల తీవ్రతను తగ్గించేందుకు సమీపంలోని గూడవల్లి కాలువ నుంచి నీటిని మళ్లించి ఇంజన్ల ద్వారా స్ప్రే చేస్తున్నారు. రాజమండ్రి, నర్సాపురం నుంచి ఓఎన్జీసీకి చెందిన నిపుణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
ఒకవేళ 24 గంటల్లోగా పరిస్థితి అదుపులోకి రాకపోతే, బావిని శాశ్వతంగా మూసివేసే ‘వెల్ క్యాపింగ్’ ప్రక్రియను చేపట్టే అవకాశముందని అధికారులు తెలిపారు. బ్లోఅవుట్ వల్ల జరిగిన నష్టం వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే నష్టం ఎంత జరిగిందనే దానిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959