హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఒక న్యూస్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సోమవారం రాత్రి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే పథకం ప్రకారం ఆ చానల్ గేట్ ముందు మోహరించిన కరీంనగర్ పోలీసులు.. ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డిని చుట్టుముట్టా రు. ఒక వ్యక్తికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో దాదాపు నలభై మంది పోలీసులు రౌండప్ చేసి కారణాలు చెప్పకుండానే అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టును కౌశిక్‌రెడ్డి ప్రతిఘటించగా, బలవంతంగా కారులో ఎక్కించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పండి అంటూ నిలదీయడంతో ‘కరీంనగర్లో నమోదైన కేసు గురించి’ అంటూ అదుపులోకి తీసుకున్నారు. ‘నేను వస్తాను.. ఎందుకు నెడుతున్నారు? నెట్టకు భయ్యా’ అని పాడి కౌశిక్‌రెడ్డి చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అరెస్టుకు సంబంధించిన వారెంట్, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది..
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వ్యక్తిగత పీఏ కాట్రోజు వినోద్ చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్-1 టౌన్ పోలీసులు భారత శిక్షాస్మృతిలోని 2023 సెక్షన్ 132, 115(2), 352, 292 కింద ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. అలాగే సమావేశంలో గందరగోళం సృష్టించి సభను తప్పుదారి పట్టించారని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో కేసు నమోదుచేశారు. కరీంనగర్ గ్రంథాలయం చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారత శిక్షాస్మృతిలోని 126(2), 115(2), 352, 292 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకొని కౌశిక్‌రెడ్డిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు..