శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు బీఆర్ఎస్కూ అవకాశం ఇవ్వాలి: కేటీఆర్.
శాసనసభలో ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం సభలోని ప్రతి సభ్యుడికి సమాన హక్కులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, శాసనసభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. “మీరు మీ వెర్షన్ చెప్పండి, మేము మా వెర్షన్ చెబుతాం. మాకు కూడా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నాం” అన్నారు.
గతంలో 2016 మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ సభను బాయ్‌కాట్ చేసి, ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. “అప్పుడు తప్పు అన్న పద్ధతి ఈరోజు ఎలా సరైనదైంది?” అని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్‌కు లేఖ కూడా ఇచ్చామని, వారు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు.
నదీ జలాలపై, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారని, ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్‌కు చెందిందన్న విషయం కూడా తెలియని పరిస్థితిలో గోదావరి–కృష్ణా జలాలపై చర్చ చేయాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సాగునీటి రంగంలో జరిగిన వైఫల్యాలను కేటీఆర్ ప్రస్తావించారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించిన ఘటనలో ఇప్పటివరకు మృతదేహాలు వెలికి తీయలేకపోయారని విమర్శించారు. సుంకిశాల ప్రాజెక్ట్ కూలిపోయినా సరైన సమాధానం లేదని, బాధ్యులైన ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ సిఫార్సు చేసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ నిలిచిపోయిన ప్రభుత్వం ఇదని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపిస్తూ, రెండు సంవత్సరాల పాలనలో ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు అందించిందా? ఒక్క చెరువును బాగు చేసిందా? ఒక్క కాలువను మరమ్మత్తు చేసిందా? అని ప్రశ్నించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి విస్తరణ ద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని చారిత్రాత్మకంగా ముందుకు తీసుకెళ్లామని, ఆ విషయాలను శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం అయితే ప్రధాన ప్రతిపక్షానికి సమాన అవకాశం కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959