సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా?.. కెటిఆర్..

పుష్ప-2 సక్సెస్‌ మీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోవడమే నటుడు అల్లు అర్జున్‌ చేసిన తప్పా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) ప్రశ్నించారు..సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా? అని నిలదీశారు. ”అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు పెట్టండి. మొదట ప్రజా సమస్యలపై చర్చిద్దాం. స్కాములు, ఫార్ములా అంటున్నారు.. అన్నీ చర్చిద్దాం. కేబినెట్‌ మీటింగ్‌లో కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి” అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన భారాస ముఖ్యనేతలతో తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సహా పలువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. రుణమాఫీ పూర్తి చేయని, రైతు బంధు ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డికి సర్పంచి ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. లగచర్ల అంశాన్ని రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తామని తెలిపారు. కొడంగల్‌ నుంచే భారాస జైత్రయాత్ర ప్రారంభం కావాలన్నారు. జమిలి ఎన్నికలు అంటున్నారు.. కాంగ్రెస్‌ను పంపేందుకు 2028 వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా రాదేమోనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.