కేసీఆర్ పుట్టిన 1954 నుంచి నేటి వరకు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇరు కుటుంబాల ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎంకి దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించి వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు…రేవంత్‌రెడ్డి.. నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ పుట్టిన 1954 నుంచి ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు.. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడబెట్టుకున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. ధైర్యముంటే వెంటనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. విచారణలో తాము తప్పుచేసినట్టు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు..గురువారం తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితాఇంద్రారెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక దినోత్సవాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి పవిత్రమైన రోజున అసెంబ్లీలో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల గురించి మాట్లాడాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు..