బీఆర్ఎస్ (BRS) పార్టీని వీడిపోయిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు..18 నెలల కాంగ్రెస్ పరిపాలన చూశాక ఈ దశాబ్ధపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టోనేనన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్ని రోజులు చూడాలి మళ్లీ కేసీఆర్ వచ్చేలా ఏదైనా ఉపాయం చూడరాదా అని ప్రజలు అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి ఉపాయమేమి లేదని ఏ పది మంది ఎమ్మెల్యేలు మన పార్టీని వీడి పోయారో ఆ పదిమందికి ఉపఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టడమే ఉపాయం అన్నారు. కుండ పగిలితే పగిలింది కుక్కబుద్ధి తెలిసింది అన్న చందంగా మనోడెవడో మనతో ఉంటూనే వెన్నుపోటు పొడిచేదెవడో తెలిసిందన్నారు. ఆవేశంతో కాదు బాధతో చెప్తున్నానని ఈ పది మంది ఎమ్మెల్యేలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
రేవంత్ వచ్చాక ఆ నినాదం మారిపోయింది:
50 ఏళ్లు అధికారం ఇస్తే కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు, కడుపునిండా బువ్వపెట్టని కాంగ్రెస్ పార్టీని ఎవరైనా నమ్ముతారా అని అనుకున్నాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీని నమ్మి బొక్కబోర్లా పడ్డారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మనందరి నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ నినాదం మారిపోయిందని బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలుగా మారిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి మాటలను వింటుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. చార్మినార్ ను రాచరికపు ఆనవాళ్లు అన్న రేవంత్ రెడ్డి.. ప్రపంచ సుందరాంగులను అక్కడికే తీసుకెళ్లి ఫోటో షూట్ చేయించారని సెటైర్ వేశారు…
రేవంత్ రెడ్డి ఒక సారి రాము.. మరోసారి రెమో..
రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. చారాణ కోడికి భారాణ మసాలా అన్నట్లు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి రాము, ఇంకోసారి రెమో అవుతాడన్నారు. సినిమాలో రెమోకు జుట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదు అంతే తేడా.. మిగదంతా సేమ్ టూ సేమ్ అని ఎద్దేవా చేశారు. అయితే.. కవిత వ్యవహారంపై మాత్రం కేటీఆర్ స్పందించలేదు.