మరోసారి సొంత పార్టీపై విమర్శలు…రాహుల్‌గాంధీ తప్పుకోవాలి..

కాంగ్రెస్ వెటరన్ నేత మణిశంకర్ అయ్యర్
(Mani Shankar Aiyar) మరోసారి సొంత పార్టీపై విమర్శల దాడి చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వాన్ని ప్రశ్నించారు. ‘ఇండియా’ కూటమి సారథ్య బాధ్యతల నుంచి రాహుల్‌గాంధీ తప్పుకోవాలని, ఆ బాధ్యతలను ప్రాంతీయ పార్టీల నేతలకు అప్పగించాలని కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన సూచించారు. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్ వంటి సమర్ధులైన నేతలు రాహుల్ గాంధీ నుంచి పగ్గాలు చేపట్టాలని అన్నారు..కాంగ్రెస్ పార్టీ ఇటీవల పలు ఎన్నికల్లో వైఫల్యాలను చవిచూడడాన్ని అయ్యర్ ప్రస్తావిస్తూ, మమతా బెనర్జీని దూరం చేసుకోవడం వల్లే కాంగ్రెస్ బలహీనపడిందని అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ లేకుంటే ‘ఇండియా’ కూటమి ఉనికికే ప్రమాదమని అన్నారు. కూటమి బాధ్యతలను తన చేతిలో పెట్టుకోకుండా ప్రాంతీయ పార్టీల నేతలైన స్టాలిన్, మమతా దీదీ, అఖిలేష్, తేజస్వి, ఇంకెవరికైనా రాహుల్ గాంధీ అప్పగిస్తారని ఆశిస్తున్నానని, వారయితే ఎక్కువ సమయం కేటాయించగలరని అయ్యర్ అన్నారు..