చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు..!
చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా సరిహద్దులో రెండు పెద్ద గ్రామాలను నిర్మించింది. వాటిలో ఒకటి అక్సాయ్ చిన్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించిన ప్రాంతంలో నిర్మించింది. భారత సరిహద్దుల్లో చైనా కొత్తగా హియాన్, హెకాంగ్ అనే రెండు కొత్త గ్రామాలను నిర్మించినట్టు చైనా ప్రభుత్వ అధికార వార్తాసంస్థ జిన్హువా వారం క్రితం ప్రచురించింది. ఈ గ్రామాల పరిపాలన కేంద్రాల్లో నిర్మించిన టౌన్‌షి్‌పలకు హాంగ్లీయూ, సెయిడుల అనే పేర్లు పెట్టారు. అక్సాయ్‌చిన్‌లో నిర్మించిన గ్రామం పేరు హియాన్. తాజా పరిణామం భారత ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. అయితే, ఇప్పటి వరకు దీనిపై భారత్ అధికారికంగా స్పందించలేదు. కాగా, సరిహద్దు వివాదం పరిష్కారానికి ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలపై చైనా ఏకపక్షంగా చేస్తున్న ఇటువంటి చర్యలు ప్రభావం చూపబోదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద టిబెటన్ బౌద్ధుల స్టడీ సెంటర్ ‘లరుంగ్ గర్ బుద్ధిస్ట్ అకాడమీ’ వద్ద సుమారు 400 దళాలను, అనేక హెలికాప్టర్లను చైనా మోహరించింది. మతపరమైన కార్యకలాపాలపై గట్టి నిఘా కోసమే ఈ మోహరింపులు చేపట్టినట్టు సీటీఏ(సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ర్టేషన్) శుక్రవారం తెలిపింది. అలాగే, సెర్థార్ ప్రాంతంలోని బౌద్ధ మఠం వద్ద వచ్చే ఏడాది కఠిన నిబంధనల అమలుకు చైనా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే అక్కడున్న చైనా విద్యార్థులను ఆ ప్రాంతం వదిలి వెళ్లాలని ఆదేశించింది. 1950లో టిబెట్‌ను చైనా ఆక్రమించింది..
*142 ఏళ్లలో ఎంత మార్పు..!*
మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7,500 కోట్లు ఖర్చుచేసి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాకు 40కోట్ల మందికిపైగా వస్తారని అంచనా వేస్తోంది. 1882లో దేశ జనాభా 22.5కోట్లు. అప్పట్లోనే మాఘ అమావాస్యనాడు 8లక్షల మంది పవిత్ర సంగమంలో స్నానమాచరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది రూ 20,288మాత్రమే. ఇప్పుడు ఏకంగా రూ.7,500కోట్లతో ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం..
*నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం*
మండల పూజ అనంతరం డిసెంబర్ 26న మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచు కోనుంది. సాయంత్రం 4 గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజల్లో డిసెంబర్ 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది…
2025-జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
• జనవరి 09: చిన్న శాత్తుమొర.
• జనవరి 10: వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం.
• జనవరి 11: వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం.
• జనవరి 15: ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.
• జనవరి 17: తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• జనవరి 18: శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం.
• జనవరి 19: పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
• జనవరి 20: శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• జనవరి 23: అధ్యాయనోత్సవాలు సమాప్తం.
• జనవరి 24: తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.
• జనవరి 25: సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం.
• జనవరి 27: మాస శివరాత్రి.
• జనవరి 29: శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు.
చాక్లెట్ బాక్స్‌ల్లో 2447 తాబేళ్లను ఉంచి అక్రమ రవాణా..
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ విషయమై కస్టమ్స్ డిపార్ట్మెంట్ గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసు కేసు నమోదు చేసింది…
95 ఏళ్ల క్రితం నాటి ప్రధాని నివాసం.. దెయ్యాలు ఉన్నాయని అనుమానాలు, దాని కథేంటంటే..!
అది ఒక పురాతన భవనం. ప్రధానమంత్రిగా ఎన్నికైన వారికి కేటాయించే అధికారిక నివాసం. దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న ఆ భవనంలోకి వెళ్లాలంటే మాత్రం కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రులు భయపడుతున్నారు. ఇక దానికి వందల కోట్లు ఖర్చు పెట్టి మరమ్మతులు జరిపినా.. పరిస్థితి మాత్రం మారలేదు. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో దెయ్యాలు ఉన్నాయనే పుకార్లు షికార్లు చేయడంతోపాటు.. కొందరు ఆ భవనంలో తమకు ఉన్న అనుభవాలను పంచుకోవడంతో.. ఆ భయాలు మరింత పెరిగాయి. దీంతో ఎంతో చారిత్రక విశిష్ఠతకు నిలయమైన ఆ ప్రధానమంత్రి భవనాన్ని భారీగా ఖర్చు చేసి నిర్మించడం, పునర్నిర్మించడం చేసినా.. అందులో ఉండేందుకు మాత్రం కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రధానులు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇంకొందరు ప్రధానమంత్రులు మాత్రం ఇవన్నీ ఉత్త మాటలే అని కొట్టిపారేస్తున్నారు. అదే జపాన్ అధికారిక ప్రధానమంత్రి నివాసం.
జపాన్ ప్రధానమంత్రిగా ఇటీవలి అక్టోబర్‌లో షిగెరు ఇషిబాని ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనను ఒక కొత్త భయం వేధిస్తోంది. జపాన్ ప్రధానమంత్రి అధికారిక నివాసంలో దెయ్యాలు ఉన్నాయనే ప్రచారంతో ఆ ఇంట్లో అడుగు పెట్టేందుకు షిగెరు ఇషిబాని ఇష్టపడటం లేదు. అయితే ఆ భవనాన్ని 1929లో మొట్టమొదట నిర్మించారు. మొత్తం 5183 చదరపు మీటర్ల విస్తీర్ణంలో.. రాతి, ఇటుకతో నిర్మించిన 2 ఫ్లోర్లలో ఆ బిల్డింగ్‌ను కట్టించారు. ఆర్ట్ డెకో డిజైన్‌తో నిర్మించిన ఈ జపాన్ ప్రధాని నివాసం.. 20వ శతాబ్దపు మొదట్లో ఆ దేశం అభివృద్ధి వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇక ఈ జపాన్ ప్రధాని నివాసం నిర్మాణం అమెరికన్ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ రూపొందించిన ఇంపీరియల్ హోటల్ నుంచి స్ఫూర్తి పొందింది. 1923లో పూర్తి అయిన ఇంపీరియల్ హోటల్.. జపాన్ను తీవ్రంగా భయపెట్టి, ధ్వంసం చేసిన గ్రేట్ కాంటో భూకంపాన్ని తట్టుకుని సైతం నిలబడింది.
అయితే ఈ జపాన్ ప్రధానమంత్రి అధికారిక భవనం.. ఆ దేశ రాజకీయాల్లో అనేక కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది. 1932లో జపాన్‌లో చెలరేగిన తిరుగుబాటులో భాగంగా అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న సుయోషి ఇనుకై.. యంగ్ నేవీ అధికారులతో అదే భవనంలోనే హత్యకు గురయ్యారు. ఆ ఘటన జరిగిన 4 ఏళ్ల తర్వాత మరోసారి జపాన్‌లో సైనిక తిరుగుబాటు చోటు చేసుకుంది. ఆ సమయంలో అదే జపాన్ ప్రధాని భవనంలో ఐదుగురిని అతి దారుణంగా కాల్చి హత్య చేశారు. ఇప్పుడు ప్రధానిగా ఉన్న కీసుకే ఒకాడా.. ఆ బిల్డింగ్‌లోని ఒక గదిలో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నారు.
ఆ తర్వాత కొన్ని దశాబ్దాల అనంతరం 2005లో జపాన్ ప్రధాని అధికారిక నివాసమైన ఆ భవనాన్ని పునర్నిర్మించారు. ఇందుకోసం జపనీస్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. 8.6 బిలియన్ యెన్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.465 కోట్లు ఖర్చు చేసి దాని రూపురేఖలే పూర్తిగా మార్చేశారు. దీంతో 2005 నుంచి ఆ భవనం ప్రధానమంత్రి అధికారిక నివాసంగా కొనసాగుతోంది. అయితే ఈ భవనం క్రమంగా హాంటెడ్ హౌజ్(దెయ్యాలకు నిలయం)గా పేరు తెచ్చుకుంది. ఇక జపాన్ మాజీ ప్రధాని సుటోము హటా భార్య యుసుకో హటా 1996లో.. ఆ భవనం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఆ బిల్డింగ్‌లో తాను విచిత్రమైన, అదృశ్య శక్తి ఉన్నట్లు తనకు అనిపించిందని చెప్పారు. అంతేకాకుండా ఆ బిల్డింగ్‌లోని గార్డెన్లో రాత్రిపూట సైనిక అధికారుల దృశ్యాలు కన్పించాయని తనకు ఆ భవనంలో ఎదురైన వింత అనుభవాలను పంచుకున్నారు. దీంతో మరోసారి ఆ భవనం గురించి పుకార్లు షికార్లు చేశాయి.
ఇక జపాన్ మరో మాజీ ప్రధాని యోషిరో మోరీ కూడా తాను ఆ భవనంలో దెయ్యాలను చూసినట్లు మాజీ ప్రధాని షింజో అబేతో చెప్పినట్లు తెలుస్తోంది. 2013లో షింజో అబే రెండోసారి ప్రధానమంత్రిగా గెలిచిన తర్వాత.. ఆ బిల్డింగ్‌లో ఉండకూడదని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ భవనం పునర్నిర్మాణం పూర్తి కాకముందే షింటో పూజారి చేత భూతవైద్యం నిర్వహించారని.. అందులో ఏవైనా ఆత్మలు ఉంటే వాటిని తొలగించినట్లు చెప్పారు. ఇక 2012 నుంచి 2020 వరకు రెండోసారి అధికారంలోకి వచ్చి.. జపాన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచిన షింజో అబే.. మళ్లీ ఆ బిల్డింగ్‌లో ఉండకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన టోక్యోలని షిబుయా జిల్లాలోని తన సొంతిట్లో నివసించారు. ఇక షింజో అబే తర్వాత వచ్చిన యోషిహిడే సుగా కూడా ఆ భవనంలో నివసించడానికి సుముఖత చూపలేదు. డిసెంబర్ 2021లో ప్రధానమంత్రి అయిన ఫుమియో కిషిదా మాత్రం ఈ భవనంలో నివాసం ఉన్నారు. తాను రాత్రివేళల్లో చాలా బాగా నిద్రపోయానని దెయ్యాలు ఉన్నాయి అనే ఊహాగానాలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
Delhi Assembly Elections 2025..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు, జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 2025 ఫిబ్రవరి 15తో ప్రస్తుత అసెంబ్లీ (ఢిల్లీ 7వ అసెంబ్లీ) గడువు ముగుస్తోంది. ఈలోగా ఎన్నికలు ప్రక్రియను పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల(2020) సమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
దళిత, మైనారిటీ వర్గాల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధిస్తూ తమ ఓటుబ్యాంకును మెరుగుపరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈ సారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే పొరుగునే ఉన్న హర్యానాలో గెలుపు వాకిట తడబడి ఓడిన కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆప్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన 53.57 శాతం ఓట్లు సాధించి 70 అసెంబ్లీ స్థానాల్లో 62 గెలుపొందగా, 38.51 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4.26 శాతానికే పరిమితమైంది.
పదేళ్ల పాలనపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతకు తోడు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, శీష్ మహల్‌గా పేరొందిన విలాస నివాస భవనం సహా 2020 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయలేకపోవడం వంటివి కేజ్రీవాల్‌కు ప్రతికూలాంశాలుగా మారాయి. ఈ ప్రతికూలతలు కేజ్రీవాల్ గతంలో సాధించిన 53 శాతం ఓట్లలో కోత విధిస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎటువైపు మళ్లుతాయి అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒకవేళ నేరుగా బీజేపీకి బదిలీ అయితే ఆ పార్టీ విశేషంగా లాభపడుతుంది. అలాకాకుండా కాంగ్రెస్ వైపు మళ్లినా సరే.. పరోక్షంగా బీజేపీకే వరంగా మారుతుంది. తాజా లోక్‌సభ ఎన్నికల తర్వాత ముస్లిం మైనారిటీలు, దళిత ఓట్లలో మళ్లీ కొంతమేర పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఈ వర్గాలను కేజ్రీవాల్‌కు దూరం చేసినా సరే.. కమలదళానికే ఉపయోగం ఎక్కువ. కాంగ్రెస్ పెంచుకునే ఓట్లశాతం ఆ పార్టీని గెలిపించకపోయినా.. దశాబ్దకాలం తర్వాత ఖాతా తెరిచేందుకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి, బీజేపీకి పరోక్ష ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
మరోవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నమేమీ కాదని, అనేక రకాల అవినీతి, అక్రమాలకు తెరలేపిందని కమలదళం ప్రజాకోర్టులో బురదజల్లింది. ఇది తనపై సాగుతున్న కక్షసాధింపు రాజకీయమని, ప్రజాకోర్టులోనే తీర్పు అడుగుతానని సీఎం పదవిని వదులుకుని ఎన్నికల ప్రచారం చేపట్టిన కేజ్రీవాల్, కేసులు, అరెస్టు, జైలుపాలవడాన్ని సానుభూతి పవనాలుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లశాతాన్ని సమీప ప్రత్యర్థి బీజేపీతో పోల్చుకుంటే 15 శాతం తేడా ఉంది. ఇందులో ప్రతికూలతల కారణంగా కొంత మేర ఓట్లు తగ్గినా.. ఈ భారీ వ్యత్యాసాన్ని పూడ్చలేవని, సీట్లు కొన్ని తగ్గినా విజయం తమదేనన్న ధీమాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది…
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ లోగోలో మార్పులు..!
తెలంగాణ ప్రభుత్వం పోలీస్ లోగోలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త లోగోను TG పోలీస్ ట్వీట్ చేసింది. గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది. లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు ప్రభుత్వ శాఖలకు ముందు TS స్థానంలో TGగా మార్చిన సంగతి తెలిసిందే..
SBIలో 14,344 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ..
SBIలో 14,344 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. JAN 7 చివరి తేది. తొలుత 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 609 బ్యాక్లాగ్ జాబ్‌లనూ యాడ్ చేశారు. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు…
తెలంగాణ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు అగ్రహం..!
తెలంగాణ సర్కారుపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? అంటూ ట్వీట్ చేశారు…ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్… వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు…ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్… వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు..ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైంది. పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది.
ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ డీజీపీని కోరుతున్నాను. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
పోలీస్ మిత్రులారా…సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత” అని హరీశ్ రావు అన్నారు..
డ్రగ్స్ రాహిత రాష్ట్రం చేయడమే లక్ష్యం..: డీజీపీ జితేందర్
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87శాతం కేసుల సంఖ్య పెరిగిందని, ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. తెలంగాణలో 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రేట్, లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ నేరాలపై వార్షిక నివేదికను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.87శాతం కేసులు పెరిగాయని చెప్పారు. 85మంది నక్సల్స్ అరెస్ట్ కాగా, 41 మందిని సరెండర్ చేయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1942 డ్రగ్స్ కేసులు నమోదు కాగా అందులో 4682 మందిని అరెస్ట్ చేశామని, 142.95 కోట్ల డ్రగ్స్ పట్టుకోవటం జరిగిందని, జీరో శాతం డ్రగ్స్ దిశగా పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుందని డీజీపీ తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని డీజీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. 180 కోట్లు వదిలిన ఫండ్స్ రీఫండ్ అయిపోతే, 247 కోట్లు విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. కొత్త చట్టాలు వచ్చిన తరువాత 85,190 కేసులు నమోదయ్యాయని, జీరో ఎఫ్ఐఆర్ కింద 1,313 కేసులు కొత్త చట్టాలు వచ్చిన తరువాత నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాది 547 మంది ఎస్ఐలు, 12,338 మంది కానిస్టేబుల్స్ నియామకం జరిగింది. డయల్ 100 ద్వారా 16,92,173 కాల్స్ వచ్చినట్లు డీజీపీ తెలిపారు…పోలీసుల బలవన్మరణాలపై డీజీపీ జితేందర్ స్పందించారు.. ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ సమస్యలతోనూ పోలీసులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని జితేందర్ పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని డీజీపీ తెలిపారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కేసు విషయంపై మీడియా ప్రశ్నించగా.. అల్లు అర్జున్ కేసు కోర్టు పరిధిలో ఉందని, ఆ కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని డీజీపీ తెలిపారు..
AP నూతన CSగా విజయానంద్.!
రాష్ట్ర నూతన CSగా సీనియర్ IAS ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత CS నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 IAS బ్యాచ్ కు చెందిన అధికారి.
బీహార్‌లో ఉద్రిక్తతలు.. ప్రశాంత్ కిషోర్‌పై కేసు నమోదు.!
బీహార్‌లో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకల వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది…అభ్యర్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలపై బీహార్‌లో ఉద్రిక్తతలకు దారి చేసింది. ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో సీఎం నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
అంతకుముందు.. విద్యార్థుల నిరసనకు జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. అయితే, నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీలకు, నిరసనలను అనుమతి లేకున్నా ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులను రెచ్చగొట్టారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రేరేపించారని పోలీసులు తెలిపారు. తమ మార్గదర్శకాలను పాటించని కారణంగా ప్రశాంత్ కిషోర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, మరో 700 మంది నిరసనకారులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత 10 రోజులకు పైగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే, ఈ పరీక్షలను పారదర్శకంగానే నిర్వహించామని.. విద్యార్థుల వాదనలకు ఎలాంటి ఆధారాల్లేవని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ఆందోళనల్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు..