యూకే కూడా ట్రంప్ బాటే…!.స్వదేశాలకు పంపే యోచన..!

అమెరికా తమ దేశం నుంచి అక్రమ వలసదారుల్ని పంపేస్తున్నట్లుగానే యూకే కూడా అదే పని చేయాలని నిర్ణయించుకుంది. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకేకు వస్తున్నారు .. అలా వచ్చిన వారు ఇల్లీగల్ గా పని చేస్తున్నారని. దానికి ముగింపు పలకబోతున్నామని యూకే ప్రధాని స్టార్మర్ ట్వీట్ చేశారు..
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవగానే దేశంలోకి అక్రమంగా చొరబడిన వారందర్నీ డిపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఇండియాకు చాలా స్వల్పంగానే తరలించారు.. మెక్సికో వంటి దేశాలకు అత్యధిక మందిని తరలించారు. అలాగే వీసా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పని చేస్తున్నా సరే ఉపేక్షించడం లేదు. వెంటనే పంపేస్తున్నారు. దీంతో అక్కడి విద్యార్థులు పార్టుటైమ్ ఉద్యోగాలు చేయడం కూడా మానేశారు. ఎవరూ బయటకు రాకుండా.. కాలేజీల్లోనే ఉంటున్నారు. వాలిడ్ వీసా దొరకదు అనుకున్నవారు తిరిగి వెళ్లిపోతున్నారు.

ఇప్పుడు అదే పద్దతిలో యూకే ప్రధాని కూడా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అమెరికా తర్వాత ఇండియా నుంచి అత్యధిక మంది విద్యార్థులు ఇటీవలి కాలంలో లండన్ వెళ్తున్నారు. అక్కడ యూనివర్శిటీల్లో ఫీజులు కట్టి చేరి.. పార్టుటైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. అక్కడ చదువు కాకుండా ఉద్యోగం చేస్తూ ఉండాలంటే హై స్కిల్ ఎంప్లాయీ అయి ఉండాలి. అయితే అక్కడ చదువుకోవడానికి వెళ్లే అత్యధిక మంది చదువు కన్నా కొంత కాలం పని చేసి ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకునేవారు. అందుకే ఇప్పుడు యూకే ప్రధాని కూడా అలాంటి వారందర్నీ పంపేయాలని అనుకుంటున్నారు.

యూకే ప్రధాని స్టార్మర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు. అమెరికా స్థాయిలో కాకపోయినా యూకేకు కూడా సరైన పత్రాలు లేకుండా వలస వచ్చేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. శాంతిభద్రతల సమస్య కూడా ఏర్పడుతోంది. ఈ కారణంగానే అందర్నీ డిపోర్టు చేయాలని స్టార్మర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

2024 జూలైలో కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన సారథ్యంలోని లేబర్ పార్టీ అప్పటినుంచే సరిహద్దుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. జనవరిలో ఇమ్మిగ్రేషన్‌ విభాగం.. వందలాది అక్రమ పనివారిని అరెస్టు చేసింది. వీరంతా సరైన అనుమతుల్లేకుండా యూకేలో అడుగుపెట్టి.. బార్లు, రెస్టారెంట్లు, కార్‌ వాషింగ్‌ కేంద్రాలు, స్టోర్లలో పనిచేసేవారే.

828 ప్రాంగణాల్లో తనిఖీలతో 609 మందిని అరెస్టు చేశారు. అయితే, జూలై నుంచి 4 వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ చెబుతోంది. ఉద్యోగాల పేరిట వీరిని నేరగాళ్ల ముఠాలు ప్రమాదకర పద్ధతుల్లో యూకే తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంకొందరైతే ఇంగ్లిష్‌ ఛానల్‌ ను ఈది మరీ వచ్చారట. అరెస్టు చేసినవారిని స్వదేశాలకు తిప్పి పంపడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అక్రమ వలసలను అడ్డుకోవడం, సరిహద్దు రక్షణ, శరణార్థుల బిల్లుపై యూకే పార్లమెంటులో చర్చ జరగనుంది..