లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష ఎంపీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంపై రాహుల్ గాంధీని మాట్లాడనివ్వనందుకు నిరసనగానే ఇలా చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పబ్లిష్ కాని ఎంఎం నరవణె పుస్తకంపై సభలో మాట్లాడేందుకు రాహుల్కు అవకాశాన్ని ఇచ్చేది లేదని ఓంబిర్లా తేల్చి చెప్పారు. దీంతో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, లోక్సభలో జరిగిన చర్చలో మాట్లాడే అవకాశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ కోల్పోయారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న విపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 5న సాయంత్రం పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే అదే రోజు ఉదయం స్పీకర్ ఓంబిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించేందుకు పార్లమెంటుకు రావొద్దని తాను ప్రధాని మోదీని కోరానని ఆయన సభలో చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ సీటు వద్దకు వెళ్లి, ఆయనతో అమర్యాదగా ప్రవర్తించాలని ప్లాన్ చేస్తున్నారనే సమాచారం తనకు అందిందని ఆరోజున స్పీకర్ అన్నారు. ఈ రెండు అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్న విపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరో నాలుగు కారణాలూ ఉన్నాయ్
స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే దిశగా విపక్షాలు యోచించడానికి దారితీసిన మిగతా అంశాలను చూద్దాం. ఇందులో “20 రోజుల నోటీసు” నిబంధన కీలకమైంది. గతంలో లోక్సభ ప్రశ్నోత్తరాల సమయం (క్వశ్చన్ అవర్)లో ప్రభుత్వ సమాధానాలను పొందేందుకు కేంద్ర మంత్రులకు కనిష్ఠంగా 10 రోజులు ముందు, గరిష్ఠంగా 21 రోజుల ముందు ప్రశ్నలను ఇచ్చే ఛాన్స్ ఎంపీలకు ఉండేది. అయితే పార్లమెంటరీ నిబంధనల సవరణలో భాగంగా 21 రోజుల గరిష్ఠ పరిమితిని పూర్తిగా ఎత్తేశారు. క్వశ్చన్ అవర్లో ప్రభుత్వ సమాధానాలు పొందేందుకు, సంబంధిత మంత్రులకు కనీసం 15 రోజుల ముందస్తు నోటీసును ఎంపీలు ఇవ్వాలనే కొత్త రూల్ను తాజాగా అమల్లోకి తెచ్చారు. దీన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభలో నిరసన తెలిపిన విపక్ష మహిళా ఎంపీలను వారి పేర్లతో స్పీకర్ పిలవడం, 8 మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం, అధికార పక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులను ఇవ్వడం వంటి స్పీకర్ ఓంబిర్లా నిర్ణయాలకు నిరసనగా ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నట్లు తెలిసింది…