ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ…!

*ఫిబ్రవరి 5నే ప్రధాని మోదీ కుంభస్నానం
ఎందుకు?*
ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న కుంభ స్నానం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఫిబ్రవరి 5నే మహా కుంభ స్నానానికి ఎందుకు వెళ్తున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఫిబ్రవరి 5.. మాఘ మాసం, గుప్త నవరాత్రి, అష్టమి తిథి(ఉత్తరాదిన) రోజున ప్రధాని మోదీ కుంభమేళాలో పుణ్యస్నానం చేయనున్నారు. ఆరోజున స్నానం చేయడం, ధ్యానం చేయడం ఎంతో మంచిదని హిందూ పురాణాలు చెబుతున్నాయి…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు..