కోదాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.
సాగునీటి కొరత కారణంగా ఎండిపోతున్న పంట నష్టం పై సమగ్ర సర్వే చేయాలి.
పంట నష్టానికి గురైన రైతులకు నష్టపరిహారం అందించాలి.
వ్యవసాయ పనులు లేక ఉపాధి కోల్పోయిన రైతు కూలీలకు వెంటనే కరువు భత్యం అందివ్వాలి..
కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్..
కోదాడ నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి కలిసి వినతిపత్రం అందజేశారు. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర కష్టాలు పడుతున్నప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ముందుస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద పత్రికా విలేకరులతో మాట్లాడుతూ బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎన్నో ఆశలతో పెట్టుబడులు పెట్టి, అప్పుల పాలై పంటలు సాగు చేస్తే, అవి కళ్లెదుటే ఎండిపోతుంటే గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తట్టుకోలేని రైతులు అప్పులు చేసి మరీ వాటర్ ట్యాంకర్లు, జనరేటర్లు తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి కనికరం లేదన్నారు. ఎన్నికల వాగ్దానాల్లో చెప్పిన రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు ఏవీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక ఉపాధి కోల్పోయిన కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామన్న హామీ కూడా గాలికి కొట్టుకుపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం రైతుల ప్రాణాలు గాలికి వదిలేసి, విలాసాల కోసం, విదేశీ పర్యటనల కోసం, ఫుట్ బాల్ మ్యాచుల కోసం వందల కోట్లు వృధాగా ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఆ వృధా ఖర్చులను తగ్గించుకుని, ఇబ్బందుల్లో ఉన్న రైతులను, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని హెచ్చరించారు. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి సామాన్య ప్రజల వైపు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా కోదాడ నియోజకవర్గంలోని కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని మండలాలను కరువు మండలాలుగా తక్షణమే ప్రకటించాలి.వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, పారదర్శకంగా పంట నష్టంపై సమగ్ర అంచనా వేసి ఎండిపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం ప్రకటించి, అప్పుల పాలైన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి. వ్యవసాయ పనులు లేక పూటగడవని పరిస్థితుల్లో ఉన్న రైతు కూలీలకు కరువు భత్యం లేదా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించాలనీ కోరుతూ ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే స్పందించి రైతాంగానికి, కూలీలకు భరోసా కల్పించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు..